
హైదరాబాద్: భారత్‌తో ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్ల గాయాల కారణంగా పరాజయాల పాలైంది. మరొక కారణమేమంటే కొత్త కెప్టెన్సీతో ఆ జట్టు నిరుత్సాహానికి గురైంది. అప్పటి వరకు సారథిగా కొనసాగుతున్న డూప్లెసిస్ గాయపడటంతో ఆ స్థానంలో భారత్‌తో వన్డే సిరీస్‌కి మార్‌క్రమ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
ఐతే ఈ నిర్ణయం సరైంది కాదని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో తలపడి వరుస వైఫల్యాలు ఎదుర్కొంటుండటంతో తాజాగా సఫారీ జట్టు మాజీ కెప్టెన్ స్మిత్ మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను ఇలా వెల్లడించాడు.
'డూప్లెసిస్ స్థానంలో మార్‌క్రమ్‌కు జట్టు నాయకత్వ బాధ్యతలు అందించడం సరైన నిర్ణయం అని నేను అనుకోవట్లేదు. భారత్‌తో వన్డే సిరీస్ ఓటమితో ఇప్పుడు ఈ అంశంపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. తక్కువ వయస్సులో, కేవలం 10 వన్డేలు కూడా ఆడని ఆటగాడికి ఎలా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారు. దీని వల్ల ఆటగాడు ఎంతో ఒత్తిడికి గురవుతాడు.' అని పేర్కొన్నాడు.
మార్‌క్రమ్ విషయంలో అదే జరిగిందని తెలిపాడు. ఒత్తిడి కారణంగానే అతడు పరుగులు కూడా చేయలేకపోయాడని వివరించాడు. భారత్‌ను ఎదుర్కొనేందుకు సఫారీ జట్టు వద్ద ప్లాన్ బీ, సీలు లేవని నిరుత్సాహపడ్డాడు. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమవుతోందంటూ విశ్లేషణకు దిగాడు.
గాయం కారణంగా వన్డే, టీ20 సిరీస్‌కు డూప్లెసిస్ దూరమయ్యాడు. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్‌కు జేపీ డుమిని నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య బుధవారం రెండో మ్యాచ్ జరగనుంది.