హైదరాబాద్: పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ తనకు తాను టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చుకుని భంగపడ్డాడు. చూసేందుకు తాను విరాట్‌లా ఉంటానని, పరుగులు చేయడంలో ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయని చెప్పడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో షెహజాద్ తీరుపై మండిపడ్డారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్‌లకు వారి జట్టు సభ్యులు, అభిమానుల నుంచి ఎంతో మద్దతు లభిస్తోందని, అయితే ఈ విషయంలో తాను దురదృష్టవంతుడినని షెహజాద్ చెప్పినట్టుగా పాకిస్థాన్‌కు చెందిన ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు ఇటీవలే ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

ఈ ట్వీట్‌పై క్రికెట్ అభిమానులు షెహజాద్ తీరుపై నిప్పులు చెరిగారు. కోహ్లీ, రూట్, విలియమ్సన్‌లతో షెహజాద్ పోల్చుకోవడం సిగ్గుచేటని, వాళ్లతో పోల్చుకునే అర్హత లేదని ఓ అభిమాని ఘాటుగా స్పందించాడు. షెహజాద్ వ్యాఖ్యలను తప్పుపడుతూ పాక్ క్రికెట్ అభిమానులు సైతం సెటైర్లు వేశారు.
ఐసీసీ వరల్డ్ టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత షెహజాద్ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ మూడు ఫార్మెట్లలో సత్తా చాటుతుంటే, షెహజాద్ మాత్రం పాకిస్థాన్ జట్టులో చోటు లభించక నానా పాట్లు పడుతున్నాడు. ఇలాంటి సందర్భంలో కోహ్లీ ఆటతీరుతో షెహజాద్ తనను పోల్చుకోవడంతో అభిమానులు ట్విట్టర్‌లో మండిపడుతున్నారు.