
క్రైస్ట్‌చర్చ్: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కావడానికి ముందు న్యూజిలాండ్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ ముక్కోణపు సిరీస్ ఆడుతోన్నాయి. ఈ టోర్నమెంట్‌కు న్యూజిలాండ్ ఆతిథ్యాన్ని ఇచ్చింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. ఫైనల్‌తో కలుపుకొని మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడాయ ఆయా జట్లన్నీ. ఆరింట్లో న్యూజిలాండ్, పాకిస్తాన్ మూడు చొప్పున మ్యాచ్‌లను గెలిచాయి. బంగ్లాదేశ్ ఖాతానే తెరవలేదు.
ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు- పాకిస్తాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయింది. ధాటిగా ఆడలేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే పాక్ బౌలర్లకు చుక్కలు చూపాడు. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్లను నష్టపోయి 163 పరుగులు చేసింది. ఈ సిరీస్ మొత్తం మీద భారీగా పరుగులు చేసిన ఓపెనర్లు ఫిన్ అల్లెన్, డెవాన్ కాన్వే- ఇక్కడ విఫలం అయ్యారు.
అలెన్-12, కాన్వే-14 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. నసీం షా బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్‌కు క్యాచ్ ఇచ్చి అల్లెన్ అవుట్ కాగా, హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్-29, మార్క్ ఛాప్‌మన్- 25, జిమ్మీ నీషమ్- 17, ఈష్ సోధి-2 పరుగులు చేశారు. 164 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ ధాటిగా ఆడుతోంది. 10 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.
కాగా- న్యూజిలాండ్‌లో కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్ హైలైట్. పాకిస్తాన్ బౌలర్ల దుమ్ము దులిపాడు కేన్ మామ. 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ సిక్సర్లు, నాలుగు మెరుపుల్లాంటి ఫోర్లు ఉన్నాయి. 155.26 స్ట్రైక్ రేట్‌తో చెలరేగాడు. ఇలాంటి బ్యాటింగ్ చూసి చాన్నాళ్లయిందనిపించేలా ఆడాడు కేన్. ఇన్నింగ్‌ను నిదానంగా ఆరంభించిన విలియమ్సన్ ఆ తరువాత విజృంభించాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక క్లాసికల్ షాట్స్ కొట్టాడు. పక్కా టీ20 ఫార్మట్‌లో స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు.