Asia Cup 2025: సరిగ్గా నెల రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 మొదలు కాబోతోంది. సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది.
ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే మ్యాచ్ ల తేదీలు, గ్రూపులు, వెన్యూలు ఖరారయ్యాయి కూడా.

చిరకాల ప్రత్యర్థుల మధ్య మూడు హై-ఓల్టేజ్ మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా సాగితే.. భారత్- పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు ఉండొచ్చు. గ్రూప్, సూపర్ 4లల్లో భారత్- పాకిస్తాన్ ఎదురుపడొచ్చు. ఈ రెండు జట్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించగలిగితే ఫైనల్స్ లో ఢీ కొనడం ఖాయమౌతుంది.
ఈ పరిణామాల మధ్య టీమిండియా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయపడటం కలకలం రేపుతోంది. ఇంగ్లాండ్ తో అయిదు టెస్ట్ మ్యాచ్ ల అండర్సన్- టెండుల్కర్ సిరీస్ సమయంలోనే అతనికి గాయమైంది. మాంఛెస్టర్ టెస్ట్ ప్రారంభానికి ముందు జిమ్‌లో గాయపడ్డాడు. మోకాలికి గాయమైంది. ఫలితంగా సిరీస్‌లోని మిగిలిన రెండు టెస్టులకూ దూరం అయ్యాడు నితీష్.
స్కానింగ్ నిర్వహించిన అనంతరం.. గాయం తీవ్రత అధికంగా ఉన్నట్లు తేలింది. ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. దీనిపై అప్ డేట్ ఇచ్చాడు నితీష్. ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోను తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. మోకాలికి సర్జరీ అవసరం కావొచ్చని చెబుతున్నారు.