హైదరాబాద్: ఆస్ట్రేలియాపై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఆనందంలో ఉన్న భారత జట్టుని కెప్టెన్ మిథాలీ రాజ్ హెచ్చరించింది. ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియా ఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం లార్డ్స్‌లో జరగనుంది.
ఫైనల్లో ఇంగ్లాండ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని ముందుగానే జట్టు సభ్యులను హెచ్చరించింది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో ఆచితూచి ఆడాలని జట్టులోని సహచర క్రికెటర్లకు సూచించింది. టీమిండియా ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మీడియాతో మాట్లాడింది.
'వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో భాగమవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం జట్టు సభ్యులందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2005లో నా నాయకత్వంలోనే భారత జట్టు తొలిసారి ఫైనల్‌కి చేరుకుంది. మళ్లీ ఇప్పుడు నా సారథ్యంలోనే ఫైనల్‌కి చేరుకోవడం ఆనందంగా ఉంది. జట్టులోని సభ్యులందరికీ తెలుసు సులువుగా టోర్నీ ఫైనల్‌కి చేరుకోలేదని. కీలక సమయాల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించాం' అని మిథాలీ పేర్కొంది.
'టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించాం. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు కూడా మెరుగుపడింది. అలాంటి జట్టుతో ఫైనల్‌లో తలపడటం సులభం కాదు. అది సొంతగడ్డపై మరీ కష్టం. ఫైనల్‌లో ఇరుజట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం. ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగుతాం' అని మిథాలీ రాజ్ తెలిపారు.