హైదరాబాద్: ఆస్ట్రేలియాకు చెందిన ఫవాద్ అహ్మద్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాది మార్చిలో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా విక్టోరియా-వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. బ్యాటింగ్ చేసేందుకు అహ్మద్ మైదానంలోకి బ్యాట్ లేకుండా వచ్చి, ఆ తర్వాత బ్యాట్ మర్చిపోయినట్లు గుర్తించిన అహ్మద్ వెనక్కి వెళ్లి దానిని తీసుకుని వచ్చిన ఘటన అభిమానులకు ఇప్పటికీ గుర్తే.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌లో పుట్టిన ఫవాద్ అహ్మద్ ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌లో రాణిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఈ సారి బ్యాట్ మర్చిపోయి కాదు. చేతి గ్లౌజుల తారుమారయ్యాయి. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 27న విక్టోరియా-క్వీన్స్‌లాండ్ మధ్య మ్యాచ్ నిర్వహించారు.

బ్యాటింగ్ చేసేందుకు అహ్మద్ క్రీజులోకి వస్తున్నాడు. అయితే ఇంతలో చేతి గ్లౌజులు తారుమారు అయినట్లు గమనించాడు. ఎడమచేతి గ్లౌజుకు బదులు కుడి చేతిదే తెచ్చుకున్నాడు. దీంతో మరో గ్లౌజ్ కావాలని డ్రస్సింగ్ రూమ్‌లో ఉన్న సహచర ఆటగాళ్లకు సూచించాడు. తన మతిమరుపునకు తనను తాను తిట్టికున్న ఫవాద్.. బ్యాట్‌తో తలను కొట్టుకున్నాడు.
దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.