
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌కు ఎమిరేట్స్ సంస్థతో చేదు అనుభవం ఎదురైంది. పీటర్సన్ ప్రస్తుతం బిగ్‌బాష్‌లీగ్‌లో ఆడుతూ మరోపక్క యాషెస్ సిరీస్‌కు కామెంటేటర్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పీటర్సన్ సొంత ఊరు వెళ్లాడు. ఆస్ట్రేలియా చేరుకునేందుకు పీటర్సన్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో తిరుగు ప్రయాణమైయ్యాడు.
ఈ నేపథ్యంలో యూకే నుంచి దుబాయ్ మీదుగా మెల్‌బోర్న్ చేరుకున్నాడు. ఈ క్రమంలో పీటర్సన్ లగేజ్ మిస్సయ్యింది. దీంతో మరికొద్దిగంటల్లో కామెంటేటర్‌గా వ్యవహరించాల్సిన పీటర్సన్‌కు దుస్తులు లేకుండాపోయాయి. దీంతో ఆగ్రహించిన పీటర్సన్ ట్విటర్ వేదికగా సంబంధిత విమానయాన సేవల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశాడు.
'మొదటిది.. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది నన్ను పికప్ చేసుకోలేదు. రెండోది... దుబాయ్ నుంచి నాకు సంబంధించిన లగేజ్ మొత్తాన్ని తీసుకురావడం మానేసింది. మరికొద్దిగంటల్లో నేను ఓ అంతర్జాతీయ టీవీ ఛానెల్‌కు పనిచేయాలి. దుస్తులు లేకుండా ఎలా చేయాలి?' అని ప్రశ్నించాడు.
వెంటనే స్పందించిన ఎమిరేట్స్ యాజమాన్యం.. పీటర్సన్ దుస్తులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఎమిరేట్స్ క్రెడిడ్ కార్డు అందజేసింది. ఇందులో ఓ సరదా విషయం కూడా ఉంది. సాక్సులు కొనేందుకు కార్డును వాడుతుండటంతో అందులో మనీ లిమిట్ దాటిపోయిందని వచ్చిందట. ఈ పనితో కోపమంతా ఎగిరిపోయి వాళ్లపై జాలి కలిగిందంటూ పీటర్సన్ చెప్పుకొచ్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.