హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఎవరంటే టక్కున చెప్పే పేరు ఏబీ డివిలియర్స్. క్రికెట్ అభిమానులు డివిలియర్స్‌ను ముద్దుగా మిస్టర్ 360, సూపర్ మ్యాన్ ఆఫ్ క్రికెట్, విధ్వంసకర బ్యాట్స్‌మన్ అని పిలుచుకుంటూ ఉంటారు.
అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ పదో సీజన్‌లో వెన్ను నొప్పి కారణంగా డివిలియర్స్ ఆలస్యంగా జట్టులో చేరాడు. వచ్చిరాగానే సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సుల సాయంతో 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

డివిలియర్స్ అద్భుతమైన ఆటతీరుని చూసిన పూణె జట్టు ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానంలో సునామీ సృష్టించే ఏబీ.. 'తుఫానీ బ్యాట్స్‌మన్' అంటూ అభివర్ణించాడు. మీరు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా అతడు బాదాలని నిర్ణయించుకుంటే ఆపడం ఎవరితరం కాదని పేర్కొన్నాడు.
మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్ కూడా డివిలియర్స్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. 'నా క్రికెట్ కెరీర్‌లో ఎంతో మంది స్టార్ బ్యాట్స్‌మెన్లతో పోరాడాను. భూ గ్రహంపై ఏబీ డివిలియర్స్ లాంటి అత్యంత భయంకరమైన ఆటగాడిని నేనెన్నడూ చూడలేదని' అని అలెన్ డొనాల్డ్ ట్వీట్ చేశాడు.