బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్.. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు పెద్దగా కలిసి రానట్టే కనిపిస్తోంది. టోర్నమెంట్ ఆరంభానికి ముందే కాదు.. దాని తరువాత కూడా ఎదురు దెబ్బలే తగిలాయి ఆ జట్టుకు. ఫుల్ టైమ్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తానికీ దూరం అయ్యాడు. ఐపీఎల్ ఫస్ట్ హాఫ్‌కు మాత్రమే అందుబాటులో ఉండడని, ఆ తరువాత అతను ఆడొచ్చంటూ ఇన్ని రోజులూ ఆశలు పెట్టుకుంది కేకేఆర్. దాన్ని వమ్ము చేశాడు శ్రేయాస్ అయ్యర్.
వెన్ను నొప్పి నుంచి కోలుకోవడం అసాధ్యం కావడంతో సిరీస్ మొత్తానికీ దూరం అయ్యాడు. అతని స్థానంలో లెఫ్ట్ హ్యాండర్ నితీష్ రాణా జట్టు సారథిగా అపాయింట్ అయ్యాడు. పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించిన అనంతరం సీజన్ మధ్యలో శ్రేయాస్ అయ్యర్ గనక జట్టుకు అందుబాటులోకి వస్తే- అప్పటి పరిస్థితులు, జయాపజయాలను పరిగణనలోకి తీసుకుని కేప్టెన్సీలో మార్పులు చేర్పులు చేస్తామని మొదట్లో ప్రకటించినప్పటికీ- అది కుదరట్లేదు. దీనితో నితీష్ రాణా సారథ్యంలోనే ఆడనుంది కేకేఆర్.

శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో కోల్‌కత నైట్ రైడర్స్.. ఈ సీజన్‌ను చెప్పుకోదగ్గ స్థాయిలో ఆరంభించలేదు. పంజాబ్ కింగ్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో పరాజయాన్ని చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. దాన్ని ఛేదించలేకపోయింది. ఒకదశలో గట్టి పోటీ ఇచ్చేలా కనిపించినప్పటికీ- వరుణుడు అడ్డుపడ్డాడు. డక్‌వర్త్ లూయిస్ మెథడ్‌లో ఓడింది.
గురువారం కోల్‌కత నైట్ రైడర్స్ తన తరువాతి మ్యాచ్‌ను ఆడనుంది. తన హోమ్ పిచ్ ఈడెన్ గార్డెన్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ప్లేయర్లు ఇప్పటికే కోల్‌కతకు చేరుకున్నారు కూడా. ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఊపులో ఉంది రాయల్ ఛాలెంజర్స్ టీమ్. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ శివమెత్తి ఆడిన మ్యాచ్ అది. దూకుడు మీద ఉన్న ఆర్సీబీని కోల్‌కత నైట్ రైడర్స్ ఎలా కంట్రోల్ చేయగలుగుతుందనేది ఆసక్తి రేపుతోంది.
ఈ పరిణామాల మధ్య శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పిపై తాజా అప్‌డేట్ వెలువడింది. తన గాయానికి అతను లండన్‌లో చికిత్స చేయించుకోనున్నాడు. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో ఉంటోన్నాడు. జూన్ 7వ తేదీన ఆరంభం అయ్యే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు కూడా అతను దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీ సూచించింది. ఇంగ్లాండ్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది టీమిండియా.