IND vs ENG: భారత క్రికెట్‌లో కీలక అధ్యాయం ముగిసింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో భవిష్యత్ కెప్టెన్ ఎవరనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. జూన్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. అయితే ఈ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రోహిత్ శర్మ నిన్న సోషల్ మీడియా ఒక పోస్టును షేర్ చేయడం ద్వారా ఈ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు రోహిత్ తర్వాత టెస్ట్ జట్టుకు కెప్టెన్ ను ఎంపిక చేయడం సెలెక్టర్ల ముందున్న పెద్ద సవాలు. కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్ , జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ పేర్లు ముందంజలో ఉన్నాయి. బుమ్రా, రాహుల్ ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్‌గా మారడం కష్టమని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
ఆ ఆటగాడే కెప్టెన్!
అయితే ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు దక్కొచ్చని వార్తలు వస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ల బృందం ఇంగ్లాండ్ పర్యటనకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రకటనకు ముందు సెలెక్టర్లు గిల్ గురించి బీసీసీఐతో మాట్లాడతారని సమాచారం.

బుమ్రా మంచి కెప్టెనే.. కానీ..!
ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ సిరీస్‌లోని 5 మ్యాచ్‌లూ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. పనిభారం నిర్వహణ కారణంగా బుమ్రా మొత్తం సిరీస్ ఆడలేడని సమాచారం. బుమ్రా మంచి కెప్టెనే అయినా ఫిట్‌నెస్, దీర్ఘకాలిక ప్రయోజనాలును దృష్టిలో పెట్టుకుని శుభ్‌మన్ గిల్‌కే టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది. అయితే బుమ్రా వైస్ కెప్టెన్‌గా కొనసాగవచ్చు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో బుమ్రా గాయపడ్డాడు. ఆ తర్వాత బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. బుమ్రా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లలో కొన్నింటిలో కూడా ఆడలేకపోయాడు. అటువంటి పరిస్థితిలో బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోదు.