WTC 2023: శ్రీలంకపై పాక్ విజయంతో టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మార్పులు.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?

శ్రీలంకలోని గాలే స్టేడియంలో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో శ్రీలంకపై అద్భుతమైన విజయం సాధించిన పాకిస్థాన్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. శ్రీలంకను 6వ స్థానానికి నెట్టేసింది. పాకిస్థాన్ తాజా విజయంతో టెస్టు ఛాంపియన్ షిప్‌లో తమ విజయ శాతాన్ని 58.33శాతానికి పెంచుకుంది. తద్వారా తొలి స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (విజయ శాతం 71.43% ), రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (70% విజయ శాతం) తర్వాత మూడో స్థానానికి పాక్ చేరుకుంది. వచ్చే ఏడాది టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను పాక్ పెంచుకుంది. ఇక పాక్‌కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ 2021 - 23లో ఇది 4వ విజయం.

అబ్దుల్లా షఫీక్ సెంచరీతో చెలరేగడంతో..
మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ రెండో ఇన్నింగ్స్‌లో 160పరుగులతో చెలరేగడంతో పాక్ 4వికెట్ల తేడాతో గెలుపొందింది. శ్రీలంక విధించిన 343పరుగుల లక్ష్యాన్ని పాక్ ఛేదించి చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి జట్టును నిలబెట్టాడు. ఇక 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం పాక్ 1-0తేడాతో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఈ నెల ప్రారంభంలో ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో విజయం సాధించి 3వ ర్యాంకుకు చేరుకుంది. అయితే తాజా ఓటమితో ఆ జట్టు విన్నింగ్ పర్సంటేజీ (48.15)గా మారడంతో మళ్లీ 6వ స్థానానికి పడిపోయింది.

ఒక స్థానం ఎగబాకిన భారత్
ఇక శ్రీలంకపై పాకిస్థాన్ విజయం సాధించడంతో భారత్ ఒక స్థానం ఎగబాకి 5వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుంది. ఇటీవల బర్మింగ్‌హామ్‌లో రీషెడ్యూల్డ్ చేసిన 5వ టెస్ట్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో 5వ స్థానానికి పడిపోయింది. ఇకపోతే రెండో టెస్టులో కూడా పాక్ విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలను దాటి నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకునే వీలుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం పాక్ ఐదో స్థానానికి పడిపోతుంది. ఇక శ్రీలంక గెలిస్తే మళ్లీ మూడో స్థానానికి చేరుకునే వీలుంటుంది. అలాగే సిరీస్‌ను కూడా సమం చేసినట్లవుతుంది.

రసవత్తరంగా టెస్ట్ ఛాంపియన్ షిప్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 సైకిల్ రసవత్తరంగా సాగుతుంది. జట్ల విజయాలు వాటి స్థానాలు మార్చడమే కాకుండా.. మిగతా జట్ల అవకాశాలను దెబ్బతీయడం, మెరుగుపరచడం జరుగుతుంది. ఇక ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇండియా వరుసగా నాలుగు స్థానాల్లో కొనసాగుతుండగా.. 5వ స్థానంలో వెస్టిండీస్ (విన్నింగ్ పర్సంటేజీ 50), ఆరో స్థానంలో శ్రీలంక, 7వ స్థానంలో ఇంగ్లాండ్ (విన్నింగ్ పర్సంటేజీ 33.33), 8వ స్థానంలో న్యూజిలాండ్ (విన్నింగ్ పర్సంటేజీ 25.93), 9వ స్థానంలో బంగ్లాదేశ్ (13.13)తో కొనసాగుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications