న్యూఢిల్లీ: భారీ ఎండార్స్‌మెంట్లతో ధనార్జనలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని దాటిపోయిన స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ పాపులారిటీలోనూ ముందడుగు వేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత పాపులారిటీ గల భారత్ క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం.
ప్రస్తుతం ధోనీ కంటే కోహ్లీకే ఎక్కువ పాపులారిటీ ఉంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మోస్ట్ ట్రెండింగ్ స్పోర్ట్స్ మన్ కోహ్లీనే. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అద్భుతంగా రాణించడంతోపాటు టీమిండియా సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించిన విరాట్ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువ చర్చించుకున్నారు.
కోహ్లీకి అభినందలు తెలుపుతూ లక్షలాది కామెంట్లు పోస్ట్ చేశారు. మార్చి నెలలో కోహ్లీ గురించి రికార్డు స్థాయిలో దాదాపు 12 లక్షల సంభాషణలు చోటు చేసుకుకున్నాయి. కాగా, ధోనీ గురించి 7 లక్షల కన్వర్జేషన్లతో తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

'భారత్‌లో కన్వర్జేషన్ వాల్యూమ్ ఎప్పుడూ 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. 10, 12 లక్షల మధ్యకు చేరడం ఇదే తొలిసారి. కోహ్లీ ఆధిక్యంలో ఉన్నారు' అని సోషల్ మీడియా ట్రాకర్ ఆటమ్న్ వరల్డ్ వైడ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ అనూష శెట్టి చెప్పారు.
ట్విట్టర్‌లో కోహ్లీకి కోటి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా, ధోనీకి 52 లక్షలా 70 వేలమంది ఉన్నారు. ఇది ఇలా ఉండగా, కోహ్లీ బ్యాటుపై అంటించిన ఎంఆర్ఎఫ్ అతనికి రూ. 8 చెల్లిస్తుండగా, ధోనీకి స్పార్టన్ రూ. 6 కోట్లు చెల్లిస్తోంది. బ్యాట్ వాల్యూలో కూడా ధోనీని ఇటీవలే కోహ్లీ దాటేశాడు. ఇప్పుడు పాపులారిటీలోనూ ధోనీని వెనక్కినెట్టాడు. కాగా, ఎండార్స్‌మెంట్లతోనే కోహ్లీ ఏడాదికి రూ. 100 కోట్లు సంపాదిస్తున్నాడు.