అవును ఆ జర్నలిస్టు సాహాను బెదిరించాడు.. నిజం నిగ్గు తేల్చిన బీసీసీఐ.. మజుందార్‌పై రెండేళ్ల పాటు నిషేధం

ఓ ఇంటర్వ్యూలో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించిన విషయంలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దోషిగా తేల్చింది. అతనిపై రెండేళ్ల నిషేధం విధించింది. ముగ్గురు సభ్యుల బీసీసీఐ కమిటీ ఈ కేసును విచారించింది. విచారణ అనంతరం మజుందార్‌దే తప్పని తేల్చింది. దీంతో రెండేళ్లపాటు ఇండియాలోని స్టేడియంలలోకి ప్రవేశించకూడదని, ఆటగాళ్లను కలవకూడదని అతనిపై నిషేధం విధించింది.

అసలేం జరిగిందంటే..?
ఈ ఏడాది ఫిబ్రవరిలో సాహా సోషల్ మీడియాలో... ఓ ప్రఖ్యాత జర్నలిస్టు నుంచిచ తనకు బెదిరింపు మెస్సేజ్‌లు వచ్చాయని స్క్రీన్‌షాట్లతో సహా షేర్ చేశాడు. ఆ స్క్రీన్ షాట్లో 'మీరు నాకు కాల్ చేయలేదు. ఇంకెప్పుడూ నేను నిన్ను ఇంటర్వ్యూ చేయను. నేను ఈ అవమానాన్ని ఏమాత్రం లైట్‌గా తీసుకోను సాహా. నేను దీన్ని తప్పక గుర్తుంచుకుంటాను.' అంటూ సాహాకు మెసేజ్ చేసినట్లు ఉంది. దీంతో అసహనానికి లోనైన సాహా ఈ మెస్సేజ్‌లున్న స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'టీమిండియా జట్టుకు సేవలందిస్తున్న ఓ క్రికెటర్ పట్ల ప్రముఖ జర్నలిస్ట్ అని పిలవబడే వ్యక్తి నుంచి నేను ఇలాంటి బెదిరింపు ఎదుర్కొన్నా. అసలు జర్నలిజం ఎలా మారిపోయిందో చూడండి' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయం తర్వాత సాహాకు ప్రముఖ క్రికెటర్లు, అభిమానుల నుంచి మద్దతు లభించింది. చాలా మంది ఆ జర్నలిస్టు ఎవరో వెల్లడించాలంటూ సాహాను కోరగా.. సాహా మాత్రం చెప్పలేదు.

బీసీసీఐ సీరియస్
ఈ విషయాన్ని బీసీసీఐ మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంది. సాహా ఆరోపణలపై విచారణ జరిపేందుకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ప్రభతేజ్ భాటియాతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ముందు ఆ జర్నలిస్టు పేరు చెప్పడానికి సాహా తొలుత సంకోచించాడు. చివరికి స్పోర్ట్ జర్నలిస్టు బోరియా మజుందార్ పేరును కమిటీకి తెలిపాడు. బీసీసీఐ ఇరువురిని విచారించింది. చివరికి మజుందార్‌ని దోషిగా తేల్చింది. రెండేళ్లపాటు నిషేధం విధించింది.

బ్లాక్ లిస్టులో మజుందార్
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. రెండేళ్లపాటు మజుందార్‌ను స్టేడియంలలోకి అనుమతించవద్దని.. భారత క్రికెట్ బోర్డులోని అన్ని రాష్ట్రాల యూనిట్లకు తెలియజేస్తామని కమిటీ పేర్కొంది. మ్యాచ్ రిపోర్టింగ్ కోసం మజుందార్‌కు మీడియా అక్రెడిటేషన్ ఇవ్వబడదని, అతన్ని బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలని, ఈ విషయాన్ని ఐసీసీకి కూడా తెలియజేస్తామని తెలిపింది. అలాగే అతనితో ఎలాంటి ఇంటర్వ్యూలు, ఫోన్ కాల్స్, మెస్సేజ్ లాంటివి చేయకూడదని ప్లేయర్లకు సూచిస్తామని స్పష్టం చేసింది. కాగా ఈ విషయంలో వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లను సాహా 'మార్చినట్లు' మజుందార్ ఈ వివాదం తలెత్తిన తొలినాళ్లలో ఆరోపించగా.. ఆ ఆరోపణలు ప్రస్తుత బీసీసీఐ నిర్ణయంతో తప్పని తేలాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications