హైదరాబాద్: టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రత్యేకమైన ఆటగాడని శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పాండ్యా 78 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టుని గెలిపించిన సంగతి తెలిసిందే.
తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్న పాండ్యాను కొనియాడుతూ కుమార సంగక్కర ట్వీట్ చేశారు. 'భారత్ సిరీస్ గెలిచింది. హార్థిక్ పాండ్యా ప్రత్యేకమైన ఆటగాడు. అన్ని పరిస్థితుల్లో ఆడేలా భారత్ పరిపూర్ణంగా ఉంది' అని సంగక్కర ట్వీట్ చేశాడు.
కుమార సంగక్కర ట్వీట్‌కు హార్దిక్ పాండ్యా ధన్యవాదాలు తెలుపుతూ మరో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌ను 3-0తో మరో రెండు వన్డేలు మిగలుండగానే భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే గురువారం బెంగళూరు వేదికగా జరగనుంది.