136 పెద్ద లక్ష్యమేమీ కాదు.. బౌలర్లు మ్యాచ్ కాపాడారు: రోహిత్

136 పరుగులు పెద్ద లక్ష్యమేమీ కాదు. మా బౌలర్లు సరైన ప్రాంతాల్లో బంతులు వేశారు.. వారే మ్యాచ్ కాపాడారు అని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 40 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పొలార్డ్ 46 (26 బంతుల్లో; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 17.4 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. ముంబై పేసర్ అల్జారి జోసెఫ్ దెబ్బకు హైదరాబాద్ చేతులెత్తేసింది. హైదరాబాద్ తరపున దీపక్ హుడా 20 పరుగులు చేసి టాప్ స్కోర్‌గా నిలిచాడు.

ఈ విజయం వారిదే:
మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'మ్యాచ్ గెలిచినందుకు చాలా గర్వంగా ఉంది. ఇదో గొప్ప అనుభూతి. 136 పరుగులు పెద్ద లక్ష్యమేమీ కాదు. అయినా చివరి బంతి వరకు పోరాడాలని ముందే నిర్ణయించుకున్నాం. మా బౌలర్లు సరైన ప్రాంతాల్లో బంతులు వేసి మ్యాచ్ కాపాడారు. ఈ విజయం వారిదే' అని రోహిత్ తెలిపారు.

140 పరుగులు చేస్తే చాలు అనుకున్నాం:
'అల్జారి బాగా బౌలింగ్ చేసాడు. తొలి మ్యాచ్‌లోనే ఇంత గొప్ప ప్రదర్శన సాధారణమైన విషయం కాదు. జోసెఫ్ కరేబియన్ ప్రిమియర్ లీగ్‌లో బాగా రాణించాడు. అదే విశ్వాసంతో బౌలింగ్ చేశాడు. మేము బ్యాటింగ్ సరిగా ప్రారంభించలేదు. కొన్ని ఓవర్ల తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతుంటే.. 170-180 పరుగులు అసాధ్యమనిపించింది. నాణ్యమైన బౌలర్లు ఉన్నారు కాబట్టి.. 140 పరుగులు చేస్తే చాలు అనుకున్నాం' అని రోహిత్ పేర్కొన్నారు.

సీజన్ ఆరంభం చాలా ముఖ్యం:
సీజన్ మొదట్లోనే వీలయినన్ని మ్యాచులు గెలిస్తే.. చివరలో ఒత్తిడి ఉండదు, అందుకే మ్యాచులు గెలవడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రపంచ కప్ కోసం కొందరు ఆటగాళ్లు జట్టును వీడుతున్నారు, ఈ విషయంలో ఏమీ చేయలేం. సీజన్ ఆరంభం చాలా ముఖ్యమైనది. చివరి రెండు మ్యాచులు జట్టులోని ఆటగాళ్ల సత్తాను వెలికితీసింది. పొలార్డ్ అద్భుతంగా రాణించాడు. బౌలర్లు అందరూ కూడా తమ వంతు కృషి చేసారు' అని రోహిత్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications