హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో విరాట్ కోహ్లీ ఒకడు. ఫిట్‌నెస్ పరంగా భారత జట్టులో ప్రమాణాలను నెలకొల్పాడు. విరాట్ కోహ్లీకి క్రికెట్ అంటే ప్రాణం. అయితే క్రికెట్ తర్వాత కోహ్లీకి ఏ క్రీడ అంటే ఇష్టమని అడిగితే.. ఎక్కువమంది ఫుట్‌బాల్ అని ఠక్కున చెప్పేస్తారు.
ఎందుకంటే విరాట్ కోహ్లీ టీమిండియా నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో జట్టులోని మిగతా ఆటగాళ్లతో ఎక్కువగా పుట్‌బాల్ ఆడుతూ కనిపిస్తుంటాడు. ఇటీవల విరాట్ కోహ్లీ ఫౌండేషన్ కోసం బాలీవుడ్ హీరోలతో కలిసి కోహ్లీసేన ఓ ఛారిటీ పుట్‌బాల్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే.

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ పుట్‌బాల్ మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం సాధించింది. అయితే కోహ్లీకి క్రికెట్ తర్వాత అత్యంత ఇష్టమైన క్రీడ ఫుట్‌బాల్ కాదని తేల్చి చెప్పాడు. ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా వెల్లడించాడు.
ప్యూమాతో కలిసి కోహ్లీ తన సొంత దస్తుల బ్రాండ్ వన్8ను గురువారం న్యూఢిల్లీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విరాట్ కోహ్లీని క్రికెట్ తర్వాత ఏ క్రీడ ఆడటమంటే ఎక్కువ ఇష్టమని అడగగా 'బ్యాడ్మింటన్. నా స్నేహితుడు ఒకరు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఆటగాడు. దీంతో నేను అతడితో కలిసి వెళ్లి బ్యాడ్మింటన్ ఆటను చాలా నేర్చుకున్నాను' అని కోహ్లీ తెలిపాడు.

ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ప్రస్తుతం శ్రీలంకతో నవంబర్ 16 (గురువారం) నుంచి జరగనున్న మూడు టెస్టుల సిరిస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఇరు జట్ల మధ్య నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.