హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ఇటీవలే తనకు తాను కోహ్లీతో పోల్చుకుని భంగపడిన సంగతి తెలిసిందే. చూసేందుకు తాను విరాట్‌లా ఉంటానని, పరుగులు చేయడంలో ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయని చెప్పడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో షెహజాద్ తీరుపై మండిపడటం కూడా జరిగింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్‌లకు వారి జట్టు సభ్యులు, అభిమానుల నుంచి ఎంతో మద్దతు లభిస్తోందని, అయితే ఈ విషయంలో తాను దురదృష్టవంతుడినని షెహజాద్ చెప్పినట్టుగా పాకిస్థాన్‌కు చెందిన ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు ఇటీవలే ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
దీంతో నీకు కోహ్లికి నీకు పోలికా? అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు షెహజాద్ తీరుపై నిప్పులు చెరిగారు. కోహ్లీ, రూట్, విలియమ్సన్‌లతో షెహజాద్ పోల్చుకోవడం సిగ్గుచేటని, వాళ్లతో పోల్చుకునే అర్హత లేదని ఓ అభిమాని ఘాటుగా స్పందించాడు.
షెహజాద్ వ్యాఖ్యలను తప్పుపడుతూ పాక్ క్రికెట్ అభిమానులు సైతం సెటైర్లు వేశారు. తాజాగా దేశవాళీ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ట్రేడ్ మార్క్ షాట్ అయిన హెలికాప్టర్ షాట్ ఆడటంతో మరోసారి షెహజాద్ వార్తల్లోకి వచ్చాడు.
'నువ్వు కోహ్లీలా ఆడతావా?': ట్విట్టర్‌లో సెటైర్లు
ధోని ఎలాగైతే హెలికాప్టర్ షాట్‌ని ఆడతాడో అచ్చం అలాగే షెహజాద్ ఆడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కరాచీలో వన్డే కప్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ తరఫున ఆడిన షెహజాద్ అన్వర్ అలీ వేసిన బంతిని హెలీకాఫ్టర్ షాట్ ఆడి స్టాండ్స్‌లోకి పంపాడు. ఈ మ్యాచ్‌లో 112 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు.