కెరీర్ లో 44 వన్డేలు, 36 టీ20లు.. మొత్తం రెండు ఫార్మాట్లో కలిపి 80 వికెట్లు. మూడు టీ20 ప్రపంచ కప్‌లు, ఓ వన్డే ప్రపంచ కప్, ఓ ఆసియా కప్... ఇంతటీ ట్రాక్ రికార్డ్ ఉన్న ఓ పేసర్ తాజాగా షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తన 12 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు పలికాడు. అతడి పేరే షాపూర్ జద్రాన్. తాజాగా తన రిటైర్మెంట్ ప్రకటనను సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
"నా అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాను. నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఇదీ ఒకటి. ప్రతీ క్రికెటర్ ఏదో ఒక రోజు ఇటువంటి నిర్ణయం తీసుకొని కెరీర్ ను ముగించాల్సిందే. క్రికెట్ ను ఓ ఆటలా చూడలేదు. నా జీవితంలో భాగంగా చూశాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు" అని చెప్పుకొచ్చాడు.

2009లో అప్ఘానిస్థాన్ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్
షాపూర్. అప్ఘానిస్థాన్ క్రికెట్ ఎదుగుదలలో తన వంతు పాత్ర పోషించాడు. కెరీర్ మొత్తంలో 44 వన్డేలు, 36 టీ20లు ఆడిన అతడు 80 వికెట్లు తీశాడు. 2010, 2012, 2016లో మూడు టీ20 ప్రపంచ కప్‌లు ఆడిన అతడు 9 వికెట్లను తీశాడు.
2015లో వన్డే ప్రపంచకప్ కూడా ఆడాడు. 2015 వన్డే ప్రపంచకప్ లో స్కాట్లాండ్ జట్టుపై తన టీమ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి హీరోగా నిలిచాడు. ప్రపంచకప్ లో అప్ఘాన్ కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ తుదిపోరులో పది ఓవర్లలో కేవలం 38 పరుగులు సమర్ఫించుకుని 4 వికెట్లు తీశాడు. 2014, 2016 ఆసియా కప్ ల లోనూ ప్రాతనిధ్యం వహించాడు. చివరిగా 2020లో ఆడాడు.