పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల మధ్య రాజకీయ, సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపాయి. వచ్చే నెలలో జరగాల్సిన కీలకమైన ట్రై సిరీస్ నుంచి అఫ్గానిస్తాన్ జట్టు సంచలనంగా తప్పుకుంది. దీనికి ప్రత్యక్ష కారణం పాకిస్తాన్ వైమానిక దాడుల్లో తమ ముగ్గురు యువ క్రికెటర్లు మరణించడమే. ఈ పరిణామం తర్వాత అఫ్గానిస్తాన్ తన అండర్-19 జట్టును పాకిస్తాన్‌కు బదులుగా భారత్‌కు పంపాలని నిర్ణయించింది.
పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరణ వెనుక కారణం
వాస్తవానికి నవంబర్ నెలలో పాకిస్తాన్, శ్రీలంక, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఓ ట్రై సిరీస్ నిర్వహించాలని ప్రణాళిక సిద్ధమైంది. అయితే సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ చేసిన వైమానిక దాడుల్లో తమ దేశానికి చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడంతో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానసిక, జాతీయ కారణాల దృష్ట్యా ఆ జట్టు పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటానికి నిరాకరిస్తూ ట్రై సిరీస్ నుంచి తప్పుకుంది.

భారత్‌లో కీలకమైన ట్రై సిరీస్
పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరించిన అఫ్గానిస్తాన్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. అఫ్గానిస్తాన్ అండర్-19 క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో జింబాబ్వే, నమీబియాల సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న అండర్-19 ప్రపంచ కప్ ) కోసం సన్నాహకంగా ఈ ట్రై సిరీస్ ఉపయోగపడుతుంది.
పోటీ జట్లు:
*అఫ్గానిస్తాన్ అండర్-19
*ఇండియా అండర్-19 'ఏ'
*ఇండియా అండర్-19 'బీ'
సిరీస్ వివరాలు, షెడ్యూల్
ఈ యువ వన్డే ట్రై సిరీస్ నవంబర్ 17, 2025న ప్రారంభమవుతుంది. ప్రతి జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సంపాదించిన టాప్-2 జట్ల మధ్య నవంబర్ 30న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (NCA) మైదానంలో జరగనున్నాయి.
షెడ్యూల్ ఇలా..
ఇండియా ఎ vs ఇండియా బి- నవంబర్ 17, 2025
అఫ్గానిస్తాన్ vs ఇండియా బి- నవంబర్ 19, 2025
అఫ్గానిస్తాన్ vs ఇండియా ఎ- నవంబర్ 21, 2025
ఇండియా ఎ vs ఇండియా బి- నవంబర్ 23, 2025
అఫ్గానిస్తాన్ vs ఇండియా బి- నవంబర్ 25, 2025
అఫ్గానిస్తాన్ vs ఇండియా ఎ- నవంబర్ 27, 2025
ఫైనల్ మ్యాచ్- నవంబర్ 30, 2025
ప్రపంచ కప్ విశేషాలు
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే అండర్-19 ప్రపంచ కప్ 2026లో మొత్తం 16 జట్లతో నిర్వహించబడుతుంది. జట్లను 4 గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు తదుపరి సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. ఈ ట్రై సిరీస్ ద్వారా అఫ్గానిస్తాన్ జట్టు ప్రపంచ కప్‌కు బలమైన సన్నద్ధతను పొందే అవకాశం ఉంది.