ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆ జట్టు టీమిండియాతో 3 వన్డేలు ఆడనుంది. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ 2022 మార్చిలో జరగనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా రాబోయే రెండేళ్ల కాలానికి అంటే 2022-23లో ఆఫ్ఘనిస్థాన్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలను బోర్డు వెల్లడించింది. బోర్డు తెలిపిన వివరాల ప్రకారం ఈ రెండేళ్ల కాలంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ఇంటా, బయటా కలిపి 11 వన్డే సిరీస్‌లు, 4 టీ20 సిరీస్‌లు, 2 టెస్ట్ సిరీస్‌లు ఆడనుంది. మొత్తం 52 మ్యాచ్‌లు ఆడనుండగా ఇందులో 37 వన్డేలు, 12 టీ20లు, 3 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ఆ జట్టు 18 మ్యాచ్‌లు స్వదేశంలో ఆడనుండగా.. 34 మ్యాచ్‌లు విదేశాల్లో ఆడనుంది. ఈ క్రమంలో ఆ జట్టు భారత్‌తోపాటు నెదర్లాండ్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్‌లతో తలపడనుంది. అలాగే ఆసియా కప్ 2022, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022, ఆసియా కప్ 2023, ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఆఫ్ఘనిస్థాన్ ఆడనుంది.
2023 చివర్లో ఆఫ్ఘనిస్థాన్.. నెదర్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం జింబాబ్వేతో వన్డేలు, టీ20లు, టెస్టులలో తలపడునుంది. జింబాబ్వేతో సిరీస్‌తో ఈ రెండేళ్ల ఆఫ్ఘనిస్తాన్ షెడ్యూల్ ముగుస్తుంది. కాగా తమ జట్టు టీ20లపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. కాగా 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు సూపర్12 దశలోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.

ఇక భారత్ విషయానికి వస్తే ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ముగించుకున్న భారత్.. త్వరలోనే సౌతాఫ్రికా బయలుదేరనుంది. అక్కడ మూడు టెస్ట్‌లతోపాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఇందుకోసం భారత జట్టు ఈ నెల 16న సౌతాఫ్రికా బయటుదేరనుంది. నిజానికి ఈ నెల 17 నుంచే టెస్టు సిరీస్ జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో 10 రోజులు వాయిదా వేశారు. కాగా పరిస్థితులు అనుకూలిస్తే టీ20 సిరీస్ కూడా నిర్వహించనున్నారు. టెస్ట్ టీమ్‌ను కోహ్లీ నడిపించనుండగా.. వన్డే, టీ20 టీమ్‌ను రోహిత్‌శర్మ నడిపించనున్నాడు.