Pakistan vs Afghanistan: షార్జా వేదికగా జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుత విజయం సాధించింది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌కు ఓపెనర్ గుర్బాజ్ తక్కువ స్కోరుకే(8 పరుగులు) ఔట్ అవ్వడంతో ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇబ్రహీం జద్రాన్(65), సెదికుల్లా అటల్(64) అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ టీ20 క్రికెట్ చరిత్రలో రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. వీరిద్దరి అర్థ సెంచరీల సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.

పాకిస్తాన్ ఇన్నింగ్స్: స్పిన్ దాడికి విలవిల
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ షయీమ్ అయూబ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఫర్హాన్, ఫఖర్ జమాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. పవర్ ప్లే ముగిసేసరికి పాకిస్థాన్ 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ రంగంలోకి దిగడంతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. వీరి ముగ్గురు పాకిస్తాన్ బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేయడమే కాకుండా వరుస వికెట్లు పడగొట్టారు. ఈ ముగ్గురు స్పిన్నర్లు కేవలం 70 పరుగులనే ఇచ్చి కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో పాకిస్తాన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.
చివరిలో పోరాడినా ప్రయోజనం లేకపాయే..
చివరి ఓవర్లలో హరీస్ రవూఫ్ (16 బంతుల్లో 34 పరుగులు) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ అతనికి సహకరించకపోవడంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ జట్లు తలా 4 పాయింట్లతో సమంగా నిలిచాయి. ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌కు చేరుకునే జట్లు ఏవో మరికొన్ని మ్యాచ్ ల తర్వాత తెలుస్తుంది.