సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. స్ట్రాంగ్ టీమ్ ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో మట్టికరిపించింది. గత వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గాన్ చేతిలో జట్టు ఓటమిని తప్పించిన గ్లెన్ మాక్స్‌వెల్ (59; 41 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఈ సారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. మందకొడి పిచ్‌పై మాక్సీ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది. గుల్బాదిన్ నైబ్ (4/20) అఫ్గానిస్థాన్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియాపై అఫ్గాన్‌కు ఇదే తొలి గెలుపు.
మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60; 49 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (51; 48 బంతుల్లో, 6 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలో 118 పరుగులు జోడించారు. అఫ్గాన్ ఓపెనర్లు క్రీజులో పాతుకుపోయినప్పటికీ ఆఖర్లో ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ప్యాట్ కమిన్స్ (3/28) హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. ఆడమ్ జంపా (2/28) రెండు వికెట్లు తీశాడు.అనంతరం ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ నైబ్ (4/20) నాలుగు, నవీనుల్ హక్ (3/20) మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. ఛేజింగ్ ఆరంభంలోనే ఆస్ట్రేలియాను నవీనుల్ హక్ దెబ్బకొట్టాడు. ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మూడు బంతులు ఎదుర్కొన్న హెడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే మిచెల్ మార్ష్ (12; 9 బంతుల్లో, 2 ఫోర్లు)ను నవీనుల్, డేవిడ్ వార్నర్ (3; 8 బంతుల్లో)ను నబీ ఔట్ చేయడంతో ఆసీస్ 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టొయినిస్‌తో కలిసి మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. టిమ్ డేవిడ్ నిదానంగా ఆడగా, మాక్సీ తనదైన శైలిలో దూకుడుగా పరుగులు సాధించాడు. అయితే డేవిడ్‌ను గుల్బాదిన్ ఔట్ చేసి వీరిద్దరి 39 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. మరోవైపు మాక్సీ లక్ష్యాన్ని క్రమంగా కరిగించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే కాసేపటికే మాక్స్‌వెల్‌ను గుల్బాదిన్ ఔట్ చేసి ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత అఫ్గాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు సాధించి మ్యాచ్‌ను ముగించారు.