ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టులో ఒకప్పుడు నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించిన మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నాడు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ప్రమాదకర స్థాయిలో తెల్ల రక్తకణాలు
ఆఫ్ఘన్ క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. షాపూర్ జద్రాన్ శరీరంలో తెల్ల రక్తకణాల స్థాయి ప్రమాదకరంగా పడిపోయింది. దీనివల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆయన సోదరుడు సోషల్ మీడియాలో షాపూర్ ఫోటోలను షేర్ చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని అభిమానులను కోరారు. షాపూర్ జద్రాన్ అనారోగ్యంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ స్పందిస్తూ.. "షాపూర్ ఎప్పుడూ మైదానంలో సింహంలా పోరాడేవాడు. ఆయన త్వరగా కోలుకోవాలని మనమంతా ప్రార్థిద్దాం" అని పేర్కొన్నారు. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ వంటి సహచర ఆటగాళ్లు కూడా షాపూర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.

షాపూర్ జద్రాన్ కెరీర్
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో షాపూర్ పాత్ర మరువలేనిది. 2015 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై ఆయన సాధించిన విజయం ఆఫ్ఘన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. షాపూర్ జద్రాన్ మొత్తం 80 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించారు. వన్డే కెరీర్లో 44 వన్డేల్లో 44 వికెట్లు తీశారు. అత్యుత్తమ ప్రదర్శన 24 పరుగులిచ్చి 4 వికెట్లు. టీ20 కెరీర్లో 36 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టారు.పొడవాటి జుట్టుతో, వేగవంతమైన రనప్‌తో బౌలింగ్ చేసే షాపూర్ ఆఫ్ఘన్ క్రికెట్ తొలి తరం సూపర్ స్టార్లలో ఒకరు. ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్ ప్రాచుర్యం పొందడానికి పునాదులు వేసిన ఆటగాళ్లలో షాపూర్ ఒకరు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.