దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అఫ్గానిస్థాన్ సంచలన ప్రదర్శన చేస్తోంది. షార్జా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికాను అఫ్గాన్ 33.3 ఓవర్లలోనే 106 పరుగులకు ఆలౌట్ చేసింది. ఏ ఫార్మాట్‌లో అయినా దక్షిణాఫ్రికా జట్టును అఫ్గానిస్థాన్ ఆలౌట్ చేయడం ఇదే ప్రథమం.
సౌతాఫ్రికాతో ఇప్పటివరకు అఫ్గాన్ రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడింది. కానీ ఒక్కసారి కూడా గతంలో ఆలౌట్ చేయలేదు. అంతేగాక విజయం కూడా సాధించలేదు. ఈసారి సఫారీలపై తొలిసారి అఫ్గాన్‌కు గెలుపు రుచి అవకాశం ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. ఎడమచేతి వాటం పేసర్ ఫజల్లా ఫరూకీ, 18 ఏళ్ల కుర్రాడు అల్లా గజన్ఫర్ దాటికి పవర్‌ప్లేలోనే 36 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.

వికెట్ల వేటను ఫజల్లా ఫరూకీ మొదలుపెట్టాడు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌ను (9) మూడో ఓవర్ ఆఖరి బంతికి క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కెప్టెన్ మార్క్‌రమ్ (2) కూడా బౌల్డ్ చేశాడు. అదే జోరును కొనసాగిస్తూ ఫరూకీ తర్వాత ఓవర్‌లో మరో ఓపెనర్ టోనీ డిజోర్జి (11)ను ఔట్ చేశాడు. ఫరూకీతో గజన్ఫర్ కూడా జత కట్టడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు.
17/1, 24/2, 25/3, 29/4, 29/5, 36/6, 36/7.. ఇలా దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వియాన్ ముల్డర్ (52; 84 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్), జార్న్ ఫోర్టుయిన్ (16; 34 బంతుల్లో, 2 ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. జోర్న్‌ను రషీద్ ఖాన్ ఔట్ చేసినప్పటికీ, బర్గర్ (1; 18 బంతుల్లో)తో కలిసి వియాన్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.
వన్డేల్లో వియాన్ తొలి అర్ధశతకం సాధించడంతో పాటు జట్టు స్కోరు 100 పరుగులను దాటించాడు. అయితే వియాన్‌ను ఫజాల్లా ఫరూకీ బౌల్ట్ చేసి అతని పోరాటానికి తెరదించాడు. చివరి వికెట్‌ను రషీద్ తన ఖాతాలో వేసుకుని దక్షిణాఫ్రికాను కుప్పకూల్చాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఫజల్లా ఫరూకీ నాలుగు వికెట్లు, గజన్పర్ మూడు, రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశారు.