
హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ అద్భుత ప్రదర్శన చేసింది. 147 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. తద్వారా ఆడిన రెండో టెస్టులోనే విజయం సాధించిన జట్టుగా ఆప్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది.
టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత 25వ(ఇంగ్లాండ్‌తో)మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. డెహ్రాడూన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో నాలుగో రోజైన సోమవారం 147 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఆప్ఘన్ జట్టులో రహ్మత్ షా(76), ఇషానుల్హా (65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో అలవోక విజయాన్ని సాధించింది.
వీరిద్దరూ కలిసి 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో రహ్మత్ షాకు ఇది రెండో హాఫ్ సెంచరీ. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగుల వద్ద ఔటైన సంగతి తెలిసిందే. ఆప్ఘన్ విజయానికి మూడు పరుగులు అవసరమైన సందర్భంలో వరుస బంతుల్లో రహ్మత్ షా, మహ్మద్ నబీ వికెట్లను చేజార్చుకుంది.
అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాహిద్ బౌండరీ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బాల్‌బిర్నీ(82), కెవిన్ ఒబ్రైన్(56) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 288 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లతో చెలరేగిన ఆప్ఘన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.
సంక్షిప్త స్కోర్లు:
తొలి ఇన్నింగ్స్:
ఐర్లాండ్: 172
ఆప్ఘనిస్థాన్: 314
రెండో ఇన్నింగ్స్:
ఐర్లాండ్: 288
అఫ్గాన్: 149/3 (47.5 Ovs)