
లీడ్స్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మరో రికార్డు బద్దలైంది. ఈ రికార్డు కూడా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్‌దే. దీన్ని బద్దలు కొట్టింది మాత్రం ఓ అనామకుడు కావడం, ఓ యంగ్ స్టార్ కావడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆప్ఘనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇక్రమ్ అలీ ఖిల్.. సచిన్ టెండుల్కర్‌ను రికార్డును చెరిపేసిన ఘనతను సాధించాడు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆ యంగ్ క్రికెటర్ ఈ ఘనతను సాధించాడు.
80కి పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా..
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఓ జట్టు తరఫున ఆడుతూ 80కి పైగా పరుగులు చేసిన ఘనత ఇప్పటిదాకా సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉంది. 1992 ప్రపంచకప్ టోర్నమెంట్ సందర్భంగా సచిన్.. ఈ మైలురాయిని అందుకున్నారు. 1992 నాటి బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో జింబాబ్వేపై సచిన్ 77 బంతుల్లో ఒక సిక్సర్, ఎనిమిది ఫోర్లతో 81 పరుగులు చేశారు. ఆ మ్యాచ్‌లో సచినే టాప్ స్కోరర్. అప్పటికి సచిన్ వయస్సు 18 సంవత్సరాల 318 రోజులు. ఆ తరువాత ఎన్ని ప్రపంచకప్ టోర్నమెంట్‌లు జరిగినా.. దీన్ని ఎవరూ అందుకోలేకపోయారు. తాజాగా ఆ ల్యాండ్‌మార్క్‌ను అందుకున్న అరుదైన క్రికెటర్‌గా ఇక్రమ్ అలీ ఖిల్ ఆవిర్భవించాడు.
వెస్టిండీస్‌పై 86 పరుగులు..
లీడ్స్‌లోని హెడింగ్లేలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇక్రమ్ అలీ 93 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం అతని వయస్సు 18 సంవత్సరాల 278 రోజులే. ఇంత చిన్న వయస్సులో 80కి పైగా పరుగులు చేసిన క్రికెటర్ మరెవరూ లేరు. ఇక ముందు కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువే. ఎందుకంటే- ఇక్రమ్ అలీ ఈ స్కోరు చేసేంత వరకూ 1992 నాటి సచిన్ రికార్డు పదిలంగా ఉంటూ వచ్చింది. దీన్నే ప్రాతిపదికగా తీసుకుంటే- మరి కొన్నేళ్లపాటు ఇక్రమ్ అలీ రికార్డుకు ఎవరి నుంచీ ముప్పు ఉండకపోవచ్చు.