అఫ్గానిస్థాన్ అసిస్టెంట్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అయితే కాంట్రాక్ట్ గడువుపై అఫ్గాన్ బోర్డు స్పష్టత ఇవ్వలేదు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లకు శ్రీధర్ అసిస్టెంట్ కోచ్‌గా ఉంటాడని, ఆ తర్వాత అవసరాన్ని బట్టి దీర్ఘకాలిక కాంట్రాక్ట్ ఇస్తామని అప్గాన్ బోర్డు పేర్కొంది.
''న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టు, దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఆర్ శ్రీధర్‌ను అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించింది. ఈ పాత్రను శ్రీధర్ సమర్థవంతం భర్తీ చేయాలని, భవిష్యత్‌లో అతనితో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చోకోవాలని ఆశిస్తున్నాం'' అని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

నొయిడా వేదికగా సెప్టెంబర్ 9 నుంచి న్యూజిలాండ్‌తో అఫ్గానిస్థాన్ ఏకైక టెస్టు ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 18 నుంచి యూఏఈలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇక 54 ఏళ్ల శ్రీధర్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. 2014 నుంచి 2021 మధ్య టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. అంతకుముందు ఆరేళ్ల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ ఫీల్డింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. అలాగే 2014 అండర్-19 వరల్డ్ కప్ భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించాడు.
దేశవాళీలో హైదరాబాద్ తరఫున శ్రీధర్ 1989 నుంచి 2000/01 వరకు ప్రాతినిథ్యం వహించాడు. 2001 నుంచి కోచింగ్ బాధ్యతలు అందుకున్నాడు. 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 15 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన అతను 574 పరుగులు, 69 పరుగులు చేశాడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 97 వికెట్లు, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. కాగా, 2021లో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు అందుకున్న రాహుల్ ద్రవిడ్... శ్రీధర్ స్థానంలో ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్‌ను తీసుకున్నాడు.