టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఇండియాలో పర్యటిస్తున్న ఆప్ఘనిస్తాన్ జట్టులో ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఆ జట్టులో కీలక సభ్యుడికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఈ వార్త తెలిసిన వెంటనే క్రీడా ప్రపంచం ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఆఫ్ఘన్ జట్టు సభ్యుడికి ఢిల్లీలోని ప్రముఖ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
హోటల్‌లో ఒక్కసారిగా గుండెపోటు
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు పర్ఫామెన్స్ అనలిస్ట్‌గా సేవలు అందిస్తున్న కేసీ రామ సుబ్రమణియన్.. జట్టుతో కలిసి ఢిల్లీలోని ఒక హోటల్‌లో ఉంటున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన అస్వస్థతకు లోనవ్వడాన్ని గమనించిన జట్టు మెడికల్ సిబ్బంది వెంటనే స్పందించి హోటల్‌లోనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించకుండా ఉండేందుకు వెంటనే దక్షిణ ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు.

వైద్యుల పర్యవేక్షణలు రామ సుబ్రమణియన్
ఆస్పత్రికి తరలించిన వెంటనే వైద్యులు ఆయనను పరీక్షించి అత్యవసరంగా యాంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం రామ సుబ్రమణియన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని ఐసీయూలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనతో ఆఫ్ఘన్ ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్, సీనియర్ ప్లేయర్ మొహమ్మద్ నబీ ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
భరోసా ఇచ్చిన బీసీసీఐ, ఐసీసీ
ఈ క్లిష్ట సమయంలో రామ సుబ్రమణియన్ కుటుంబానికి ప్రైవసీ కల్పించాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సానుకూలంగా స్పందించాయి. రామ సుబ్రమణియన్‌కు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని రెండు సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే ఆయా సంస్థల ప్రతినిధులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.