సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అఫ్గానిస్థాన్ మరో అద్భుత విజయం సాధించింది. వరల్డ్ నంబర్ 3 ర్యాంకర్ దక్షిణాఫ్రికాను 177 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. షార్జా వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆల్‌రౌండ్ షోతో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. సౌతాఫ్రికాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచింది. అంతేగాక పరుగుల పరంగా వన్డేల్లో అఫ్గాన్‌కు ఇదే భారీ విజయం. మరోవైపు సఫారీ సేనకు అయిదో అతి పెద్ద ఓటమి.
మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 311 పరుగులు చేసింది. గుర్బాజ్ (105; 110 బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. అజ్మతుల్లా (86; 50 బంతుల్లో, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. రహ్మత్ (50; 66 బంతుల్లో, 2 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఎంగిడి, బర్గర్, పీటర్, మార్క్‌రమ్ తలో వికెట్ తీశారు.

అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 34.2 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బవుమా (38; 47 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. టోని డిజోర్జి (31; 44 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), మార్క్‌రమ్ (21; 30 బంతుల్లో, 1 ఫోర్), రీజా హెండ్రిక్స్ (17; 34 బంతుల్లో, 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. బర్త్‌డే బాయ్ రషీద్ ఖాన్ (5/19) అయిదు వికెట్లు, ఖరోటె (4/26) నాలుగు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు.
అయితే శతకం బాది విజయంలో కీలక పాత్ర పోషించిన అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ అరుదైన ఘనతలు సాధించాడు. వన్డేల్లో అఫ్గాన్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా గుర్బాజ్ నిలిచాడు. 22 ఏళ్లకే గుర్బాజ్ ఈ రికార్డు అందుకోవడం విశేషం. 42 వన్డేల్లో అతను ఏడు సెంచరీలు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు మహ్మద్ షాజాద్ (6) పేరిట ఉండేది.
అంతేగాక రహ్మనుల్లా గుర్బాజ్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 23 ఏళ్ల లోపు అత్యధిక వన్డేలు సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌గా విరాట్ కోహ్లి సరసన నిలిచాడు. బాబర్ అజామ్‌ను అధిగమించి మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (8), క్వింటన్ డికాక్ (8), గుర్బాజ్ (7), విరాట్ కోహ్లి (7), బాబర్ అజామ్ (6), ఉపుల్ తరంగ (6) టాప్‌లో ఉన్నారు.