యూఏఈ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌లో అఫ్గానిస్థాన్ ఘనంగా బోణీ కొట్టింది. షార్జా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్ ఆరు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. దక్షిణాఫ్రికాపై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి విజయం. బాల్స్ పరంగా (146 బంతులు) టెస్టు ఆడే జట్లపై సాధించిన మూడో అతిపెద్ద విజయం ఇదే. ఇక ఈ సంచలన విజయంతో భారత్‌పై మినహా మిగిలిన పూర్తిస్థాయి సభ్య దేశాలపై అఫ్గాన్ గెలుపు రుచి చూసింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి 33.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌట్ చేసింది. ఏ ఫార్మాట్‌లో అయినా దక్షిణాఫ్రికా జట్టును అఫ్గానిస్థాన్ ఆలౌట్ చేయడం ఇదే ప్రథమం. ఎడమచేతి వాటం పేసర్ ఫజల్లా ఫరూకీ, 18 ఏళ్ల కుర్రాడు అల్లా గజన్ఫర్ దాటికి పవర్‌ప్లేలోనే 36 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.

17/1, 24/2, 25/3, 29/4, 29/5, 36/6, 36/7.. ఇలా దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వియాన్ ముల్డర్ (52; 84 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్), జార్న్ ఫోర్టుయిన్ (16; 34 బంతుల్లో, 2 ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. జోర్న్‌ను రషీద్ ఖాన్ ఔట్ చేసినప్పటికీ, బర్గర్ (1; 18 బంతుల్లో)తో కలిసి వియాన్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. వన్డేల్లో వియాన్ తొలి అర్ధశతకం సాధించడంతో పాటు జట్టు స్కోరు 100 పరుగులను దాటించాడు.
అనంతరం ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ 26 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (25 నాటౌట్; 36 బంతుల్లో, 2 సిక్సర్లు), గుల్బాదిన్ నైబ్ (34 నాటౌట్; 27 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే ఛేజింగ్‌లో అఫ్గాన్ పేలవారంభం దక్కింది. రహ్మనుల్లా గుర్బాజ్ ఎదుర్కొన్న మూడో బంతికే డకౌటయ్యాడు.
కాసేపటికే వన్‌డౌన్‌లో వచ్చిన రహ్మత్ షా (8), మరో ఓపెనర్ రియాజ్ హసన్ (16) కూడా వెనుదిరగడంతో 38 పరుగులకే అఫ్గాన్ మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో దక్షిణాఫ్రికా పోటీలోకి వచ్చింది. అఫ్గాన్ కెప్టెన్ హస్మతుల్లా (16) కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. అయితే అజ్మతుల్లా, గుల్బాదిన్ జాగ్రత్తగా ఆడుతూ సఫారీలకు ఛాన్స్ ఇవ్వలేదు. కాగా, షార్జా వేదికగా శుక్రవారం రెండో వన్డే జరగనుంది.