
అర్ధ శతకంతో మెరిసిన బాబర్:
శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ నబీ (35 నాటౌట్; 32 బంతుల్లో 5x4), గుల్బాడిన్ (35 నాటౌట్ ; 25 బంతుల్లో 4x4, 1x6) ఇన్నింగ్స్ చివర్లో ధాటిగా ఆడి పాక్ ముందు పోరాడే లక్ష్యంను ఉంచారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. పాక్ విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు అవసరమైన దశలో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ఆసిఫ్ అలీ (7 బంతుల్లో 25 నాటౌట్; 4 సిక్సర్లు) నాలుగు సిక్సర్లు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు బాబర్ ఆజామ్ (51; 47 బంతుల్లో 4x4) అర్ధ శతకంతో మెరిశాడు. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా నిలిచాడు.

తొలి కెప్టెన్‌గా బాబర్ రికార్డు:
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 26 ఇన్నింగ్స్‌లలో టీ20 క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో 1000 పరుగులు పూర్తిచేసుకున్న తొలి కెప్టెన్‌గా బాబర్ నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్స్‌ల్లో టీ20 క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. దీంతో పాక్ కెప్టెన్ బాబర్.. భారత సారథి రికార్డును బద్దలుకొట్టాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ (31), ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (32), న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ (36) ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించారు. పాక్ తరఫున బాబర్ 64 టీ20ల్లో 2332 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

టీ20ల్లో అరుదైన రికార్డు:
మరోవైపు అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా టీ20ల్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజామ్, మహ్మద్ హఫీజ్‌లను ఔట్ చేయడం ద్వారా టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులోకి ఎక్కాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ 76 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ 53 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు అందుకోవడం విశేషం. ఈ జాబితాలో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ (82), బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ (83) ఇన్నింగ్స్‌లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. అఫ్గాన్ తరఫున రషీద్ ఖాన్ 53 టీ20లు ఆడి 101 వికెట్లు పడగొట్టాడు. ఐదు వికెట్లు రెండుసార్లు.. నాలుగు వికెట్లు నాలుగుసార్లు పడగొట్టాడు.

వన్డేల్లో కూడా 100 వికెట్లు:
రషీద్ ఖాన్ వన్డేల్లోనూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఇదివరకు రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 2018లో రషీద్ 44 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. దీంతో అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో అందరి కన్నా తక్కువ మ్యాచ్‌ల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా ఈ అఫ్గాన్ స్పిన్నర్ ప్రత్యేకత ఘనత అందుకున్నాడు. అఫ్గాన్ తరఫున రషీద్ ఖాన్ 74 వన్డేలు ఆడి 140 వికెట్లు పడగొట్టాడు. ఐదు వికెట్లు నాలుగుసార్లు.. నాలుగు వికెట్లు ఐదుసార్లు పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












