
అబుదాబి: సూపర్ సండేలో భాగంగా ఈరోజు డబుల్ ధమాకా ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021లో 27వ మ్యాచ్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో ఆఫ్గనిస్తాన్, నమీబియా జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకి మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముజీబ్ అన్ ఫిట్ కావడంతో హమీద్ హసన్ ఈ మ్యాచ్ ఆడనున్నాడు. మరోవైపు నమీబియా ఎలాంటి మార్పులు చేయలేదు.
ఇక అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత విజయవంతమైన సారథిగా కొనసాగిన అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. దాంతో ఈరోజు అతడు ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. దాంతో ఈ మ్యాచ్ గెలిచి అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని అఫ్గాన్ ప్లేయర్స్ చూస్తున్నారు.
అఫ్గాన్ తన చివరి మ్యాచులో పాకిస్తాన్‌పై ఓడినా.. గెలిచినంత పనిచేసింది. ముందుగా బ్యాటింగ్, ఆపై బౌలింగ్‌లో సత్తాచాటింది. మరోవైపు నమీబియా తమ చివరి మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌ను ఓడించింది. స్కాట్‌లాండ్ కూడా అన్ని విభాగాల్లో రాణించింది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు.
ఆఫ్గనిస్తాన్, నమీబియా జట్లు ఇంతవరకు ఒకదానితో ఒకటి అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో తలపడలేదు. టీ20 ప్రపంచకప్ 2021లో మరికొద్ది సేపట్లో ఇరు జట్లు మొదటిసారి తలపడనున్నాయి. దాంతో విజయం కోసమే ఇరు జట్లు చూస్తున్నాయి. ఆఫ్గనిస్తాన్, నమీబియా జట్లలో స్టార్ ఆటగాళ్లకు ఏ మాత్రం కొదవలేదు. దాంతో మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. అబుదాబిలో ఛేజింగ్ చేసేందుకే అన్ని జట్లు ఆసక్తి చూపిస్తాయి. ఈ టోర్నమెంట్‌లో అబుదాబి పిచ్‌పై ఆడిన 7 మ్యాచుల్లో రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్టు 6 సార్లు విజయాలు సాధించాయి. అయితే ఆఫ్గనిస్తాన్ మాత్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం. స్పిన్నర్లకు ఈ పిచ్ బాగానే కలిసొస్తుంది. ఈ రోజు కూడా స్పిన్నర్లు ప్రభావం చూపనున్నారు.
తుది జట్లు:
ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్ (కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, అస్గర్ ఆఫ్ఘన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ (కెప్టెన్), గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, హమీద్ హసన్.
నమీబియా: క్రెయిగ్ విలియమ్స్, మైఖేల్ వాన్ లింగేన్, జేన్ గ్రీన్ (కీపర్), గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), డేవిడ్ వైస్, జేజే స్మిత్, జాన్ ఫ్రైలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్.