
సిడ్నీ: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనను ఔట్ చేసినప్పుడల్లా ఫీల్డర్లు ఒక మాట అంటుండేవారని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ చెప్పాడు. తాజాగా గిల్‌క్రిస్ట్ లైవ్‌కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారత్‌తో ఆడేటప్పుడు నేను పరుగులు చేస్తుంటే టీమిండియా ఆటగాళ్లు ఏమనేవారు కాదు. కానీ భజ్జీ బౌలింగ్‌లో ఔటయితే మాత్రం ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు. ఆ మాటేంటో నాకుతెలియదు, అది పలకడం కూడా నాకు రాదు' అని ఆసీస్ మాజీ కీపర్ తెలిపాడు.
'నేను భారత్‌లో పర్యటించేటప్పుడు మంచి ఆతిథ్యం లభించేది. చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఐపీఎల్ సమయంలో ప్రేక్షకులు ఇచ్చిన మద్దతును ఎప్పటికీ మర్చిపోలేను. ఒకసారి ముంబైలో ఉదయాన్నే లేచి ఎవరూ గుర్తు పట్టకుండా గాగుల్స్, టోపీ, ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని జాగింగ్‌కు వెళితే స్థానికులు గుర్తుపట్టారు. కొద్ది దూరం వెంటపడి ఫొటోలు తీసుకొనేందుకు ఆసక్తి చూపారు. అది నాకు మధుర జ్ఞాపకం' అని ఆసీస్ మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ చెప్పాడు.
భారత్‌లో మళ్లీ ఎప్పుడు అడుగుపెడతానో తెలియదని, అక్కడికి రావడానికి చాలా ఆశగా ఎదురు చూస్తున్నానని గిల్లీ చెప్పుకొచ్చాడు. గిల్‌క్రిస్ట్ ఐపీఎల్‌లో గతంలో డెక్కన్ ఛార్జెర్స్ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. అతడి సారథ్యంలోనే 2009లో ఛార్జెర్స్ టైటిల్ విజేతగా నిలిచింది. వన్డేలో ఓపెనర్‌గా, టెస్టుల్లో 7వ స్థానంలో ఆడుతూ.. ఆసీస్ జట్టుకు విశేష సేవలందించిన గిల్‌క్రిస్ట్ ప్రపంచంలో ఉత్తమ వికెట్ కీపర్‌గా ఎదిగాడు. అంతర్జాతీయ కెరీర్‌లో గిల్లీ 96 టెస్టుల్లో, 287 వన్డేల్లో, 13 టీ20 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇదే షోలో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను ఉత్తమ కీపర్ ఎవరు అని అడగ్గా.. 'ఎంఎస్ ధోనీనే ఎంచుకుంటా. నా పేరు గిల్లీ.. సిల్లీ కాదు. నాకు తెలుసు భారత్‌లో ఎంతో మంది అభిమానులున్న ధోనీ గురించి మాట్లాడుతున్నానని. నా దృష్టిలో ధోనీనే ఎప్పుడూ టాప్‌లో ఉంటాడు. శ్రీలంక నుంచి కుమార సంగక్కర, న్యూజిలాండ్ నుంచి మెక్‌కల్లమ్, దక్షిణాప్రికా నుంచి మార్క్ బౌచర్‌లు ఉత్తమ కీపర్లు. వీరందరిలో భారత మాజీ కెప్టెనే ఉత్తమం. ఆ తర్వాతి స్థానాల్లో సంగక్కర, మెక్‌కల్లమ్, బౌచర్ ఉంటారు' అని తెలిపాడు.