వచ్చే ఏడాది భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి డే-నైట్ టెస్టు?!!

హైదరాబాద్: భారత్ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో డే-నైట్ టెస్టు ఆడేందుకు అంగీకరించొచ్చని ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గతేడాది టీమిండియా పర్యటించినప్పుడు తమతో గులాబి టెస్టు ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదించగా.. బీసీసీఐ అంగీకరించని సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం బంగ్లాతో తొలి డే-నైట్ టెస్టు ఆడేందుకు కోహ్లీ సేనను ఒప్పించాడు.

భారత్, ఆస్ట్రేలియా మధ్య డే-నైట్ టెస్టు:
భారత్, బంగ్లాదేశ్ జట్లు తొలిసారి డే-నైట్ టెస్టు ఆడుతుండటంతో గిల్‌క్రిస్ట్ తాజాగా స్పందించాడు. 'టీ20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ పర్యటిస్తుంది. అప్పుడు కచ్చితంగా డే-నైట్ టెస్టు ఉంటుందని ఆశిస్తున్నా. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా.. ఓ మ్యాచ్ ఉంటుందనే భావిస్తున్నా. మొదట్లో డే-నైట్ టెస్టులను నేను వ్యతిరేకించా. ఇప్పుడు టెస్టు క్రికెట్‌కు అవసరమైన సానుకూల ఫలితాలను చూస్తున్నా' అని గిల్‌క్రిస్ట్ అన్నాడు.

ఉపఖండంలో మంచు సమస్యలు:
'ఉపఖండంలో డే-నైట్ టెస్టు జరిగేటప్పుడు మంచు తరహా సమస్యలు ఉంటాయి. సిరీస్‌లు, వేదికలు నిర్ణయించేందుకు సమయం పడుతుంది. సూర్యాస్త సమయంలో ఆడటం కష్టమే. అయితే పిచ్‌లపై కవర్లు కప్పకుండా, హెల్మెట్లు లేకుండా ఆడిన రోజులు ఉన్నాయి. కాలం గడిచేకొద్దీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఆటను బతికించేందుకు చేసే ప్రతి ప్రయత్నాన్నీ స్వాగతిస్తున్నాను' అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.

ప్రతి మ్యాచ్ విలువ, పోటీ పెరిగాయి:
'ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ద్వారా ప్రతి మ్యాచ్ విలువ, పోటీ పెరిగాయి. ప్రస్తుత కాలంలో అభిమానులు టెస్టు క్రికెట్‌ను ఎక్కువగా చూసే రోజులు బహుశా పోయాయనే అనుకుంటున్నా. అందుకు కారణం టీ20లు. అయితే భారత్-ఆస్ట్రేలియా, యాషెస్ సిరీస్‌లు ఇప్పటికీ అభిమానులను ఆకర్షిస్తున్నాయి' అని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.

పంత్‌ను ధోనీతో పోల్చొద్దు:
భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంఎస్ ధోనీతో పోల్చొడం సరికాదని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. 'భారత అభిమానులకు, మీడియాకు నేనో విజ్ఞప్తి చేస్తున్నా.. యువ ఆటగాడిని (పంత్) ధోనీతో పోల్చే ప్రయత్నం కూడా చేయకండి. ధోనీ స్థానాన్ని భర్తీచేయడం క్లిష్టమైనది. పంత్ ఎంతో ప్రతిభావంతుడు. అతడిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రతి మ్యాచ్‌లో ధోనీ తరహాలో రాణించాలని ఆశిస్తున్నారు. పంత్‌ను ధోనీలా తీర్చిదిద్దుదామనుకుంటే అతడు తన సహజ స్వభావాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఇదే నేను పంత్‌కు ఇచ్చే సలహా' అని గిల్లీ చెప్పాడు. .
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications