ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ తో హోరెత్తిపోయింది. ఉత్కంఠభరితమైన ఈ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రీడాభిమానులు, సెలబ్రిటీలు భారీగా తరలివచ్చారు. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ఒకరు ఉన్నారు.. ఆమె ఎవరో కాదో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్,హీరోయిన్ శ్రీలీల.
స్టేడియంలో శ్రీలీల గ్లామర్ మెరుపులు
స్టేడియం గ్యాలరీలో కనిపించిన శ్రీలీల.. తన చిరునవ్వుతో ప్రేక్షకులను, అభిమానులను అలరించారు. సాధారణంగా సినిమాల్లో ఎంతో చురుకుగా, గ్లామరస్‌గా కనిపించే శ్రీలీల..ఈ క్రికెట్ మ్యాచ్‌లో తనదైన శైలిలో సందడి చేశారు. ఆమెను చూడగానే అభిమానులు కేరింతలు కొడుతూ, కెమెరాలకు ఫోజులు ఇచ్చేలా కోరారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఉత్కంఠభరితమైన మ్యాచ్.. శ్రీలీల ఎంజాయ్మెంట్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ చేసిన విధ్వంసకర శతకం మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. ఒకవైపు మ్యాచ్‌లో జరుగుతున్న పోరాటాన్ని, మరోవైపు స్టేడియం వాతావరణాన్ని శ్రీలీల ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. భారత జట్టుకు మద్దతు తెలుపుతూ ఆమె చేసిన హావభావాలు అభిమానులను కట్టిపడేశాయి.
సోషల్ మీడియాలో వైరల్
శ్రీలీల వాంఖడే స్టేడియంలో ఉన్న ఫోటోలను చూసిన నెటిజన్లు, "మన హీరోయిన్ కూడా క్రికెట్ ప్రేమికురాలేనా?" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె లుక్స్‌పై, ఆ సందర్భంలో ఆమె ఎంచుకున్న డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి కీలకమైన క్రీడా సమయాల్లో ప్రత్యక్షంగా హాజరై సందడి చేయడం పట్ల ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల తన తదుపరి సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉండగా, మధ్యలో దొరికిన ఈ విరామాన్ని ఆమె ఇలా క్రీడా ప్రాంగణంలో గడపడం అందరినీ ఆకట్టుకుంది.
మ్యాచ్ వివరాలిలా..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే...ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. . సంజూ శాంసన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 43), ఇషాన్ కిషన్(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మెరుపులు మెరిపించారు. చివర్లో తిలక్ వర్మ(7 బంతుల్లో 3 సిక్సర్లతో 21), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27)దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్(2/40), ఆదిల్ రషీద్(2/41) రెండేసి వికెట్లు తీయగా... జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు 19 సిక్సర్లు, 20 ఫోర్లు బాదారు.
అనంతరం ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమిపాలైంది. జాకబ్ బెథెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105 ) శతకంతో ఒంటరి పోరాటం చేయగా.. విల్ జాక్స్(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/38) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా(1/33), వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.