ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ గతేడాది గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అతని గుర్తుగా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో లీడ్ రోల్స్ చేస్తున్న హీరోహీరోయిన్లు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే వీళ్లిద్దర్నీ ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం ఇద్దరూ బాగానే ఉన్నారని సమాచారం.
ఈ సినిమాలో షేన్ వార్న్ పాత్రలో అలెక్స్ విలియమ్స్, వార్న భార్య సిమోన్ పాత్రలో మార్నీ కెనెడీ నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి మార్నీ పూర్తి వివరాలు వెల్లడించింది. 'సినిమాలో షేన్, సిమోన్ ఇద్దరూ యంగ్‌గా ఉన్నప్పుడు మంచి రొమాంటిక్ సీన్ ఉంది. ఆ సీన్ షూటింగ్ చేసే సమయంలోనే ఇద్దరం గాయపడ్డాం' అని మార్నీ తెలిపింది.

'ఈ సీన్‌లో నేను, అలెక్స్ ఇద్దరం కారిడార్‌లో నడుస్తూ బెడ్రూంలోకి సడెన్‌గా వెళ్తాం. తలుపు నెట్టుకొని డైరెక్ట్‌గా బెడ్‌పై పడాలి. కానీ ఇద్దరం బెడ్ మిస్ అయ్యాం. దీంతో నేలపై పడిపోయాం. ఈ ప్రమాదంలో అలెక్స్ తలకు బాగా గాయమైంది. నా చేతికి దెబ్బ తగిలింది. వెంటనే ఎమర్జెన్సీ రూమ్‌కు తీసుకెళ్లాం. అక్కడ అతని తలకు, నా మణికట్టుకు కట్టుకట్టారు' అని ఆమె వెల్లడించింది.
అయితే ఇది అంత ప్రమాదకరమైన యాక్సిడెంట్ కాదని మార్నీ చెప్పింది. కానీ ఇద్దరం గెటప్‌లో ఉండగానే ఆస్పత్రికి తీసుకెళ్లారని, ఆ సమయంలో బ్లీచ్ చేసుకున్న జుట్టు, కాస్ట్యూమ్స్‌లో ఆస్పత్రిలో కూర్చున్నామని చెప్పింది. 'కొంచెం పెద్ద వయసున్న రెసిడెంట్స్ మధ్యలో మేం మాత్రం కాస్ట్యూమ్స్‌లో కూర్చొని ఉండటం నవ్వు తెప్పించింది' అని ఆమె చెప్పింది.
ఈ వార్తలు విన్న కొందరు ఫ్యాన్స్.. వార్న్ ఆత్మకు ఈ సీన్ వల్ల కోపం వచ్చి ఉంటుందని, అందుకే వీళ్లకు ఇలా దెబ్బ తగిలేలా చేశాడని అంటున్నారు. 'వార్నీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌లో షేన్ వార్న్ జీవితంలోని పలు సంఘటనలు చూపించనున్నారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌గా వార్న్ ఎదిగిన తీరు, అతని జీవితంలో ఎదుర్కొన్న కాంట్రవర్సీలు కూడా ఈ సిరీస్‌లో చూపిస్తారట.