
హైదరాబాద్: కోచ్‌లు, గురువులు సైతం తల్లిదండ్రుల వంటి వారేనని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. తన చిన్ననాటి క్రికెట్ గురువు రమాకాంత్ అచ్రేకర్‌ను గుర్తు చేసుకుంటూ ఆయన మాట్లాడుతూ.. 'కోచ్‌లు, గురువులు తల్లిదండ్రులతో సమానులు. మనం వారితో చాలా సమయం గడుపుతాం. వారి నుంచే ఎన్నో నేర్చుకుంటాం' అని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సచిన్ గురువుల ప్రాముఖ్యం వివరించారు.
'ఒక్కసారి కూడా అచ్రేకర్ సర్ బాగా ఆడావు అని మెచ్చుకోలేదు. గురువుగారు అంత కఠినంగా ఉండేవారు. అంతే జాగ్రత్తగా చూసుకునేవారు. ప్రేమించేవారు. కానీ అప్పుడప్పుడు భేల్ పూరీ తినిపించే వారు. అంటే అప్పుడు నేను మైదానంలో బాగా ఆడానని గుర్తించేవాడిని' అని సచిన్ తన చిన్ననాటి గురువు గురించి చెప్పుకొచ్చారు.
ఇంకా తన తల్లిదండ్రుల గురించి సచిన్ మాట్లాడుతూ.. నేను చాలా అల్లరి చేసే వాడిని. నా అల్లరి భరించలేకపోయేవారు. కానీ, మా కుటుంబం నన్ను చక్కగా చూసుకునేది. ఇలాంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం. మా నాన్న నాపై ఎప్పుడూ కోప్పడేవారు కాదు. నా గురించి ఆందోళన పడేవారు కాదు. స్వేచ్ఛనిచ్చారు. అయితే కఠినంగా ఉండాల్సిన సమయంలో కఠినంగానే ఉన్నారు' అని సచిన్ వ్యాఖ్యానించారు.
ఒకానొక సందర్భం గురించి సచిన్ ప్రస్తావిస్తూ.. 'అప్పుడు నాకు పదమూడేళ్ల వయస్సు. నేను జాతీయ క్యాంప్ నిమిత్తం ఓ నెల రోజులు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో మొబైల్ ఫోన్‌లు అందుబాటులో లేవు. ఆ సమయంలో అమ్మ చాలా కంగారుపడింది. మా నాన్న ఆ సమయంలో నాకు స్ఫూర్తినిచ్చారు. నేను చాలా చురుకైన వాడినని, అందరి కంటే తెలివిగా ప్రవర్తించగలనని అమ్మకు చెప్తూనే నాకు గుర్తు చేశారు' అని సచిన్ పేర్కొన్నాడు.
తాను కెరీర్‌లో ఎడతెరపి లేకుండా ఆడుతున్నప్పుడు పిల్లలు సారా, అర్జున్‌ని తన భార్య అంజలి చక్కగా పెంచిందని సచిన్ అన్నారు. తద్వారా ఇద్దరం జీవితాల్లో బాగా రాణించామని తెలిపారు. కార్యక్రమంలో సచిన్‌తో పాటుగా అంజలి కూడా పాల్గొన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.