టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ముషీర్ ఖాన్‌తో పాటు అతని తండ్రి నౌషద్ ఖాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరానీ కప్ కోసం కాన్పూర్ నుంచి లక్నోకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.
రోడ్డు ప్రమాదంలో ముషీర్ ఖాన్‌కు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. లక్నో వేదికగా అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్ జరగనున్న విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీ విజేత ముంబైతో రెస్టాఫ్ ఇండియా తలపడనుంది. ముంబై జట్టులో కీలక ప్లేయర్ అయిన 19 ఏళ్ల ముషీర్ ఖాన్ ఇరానీ కప్ కోసం సిద్ధమయ్యాడు. అయితే లక్నోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

దీంతో ముషీర్ ఖాన్ ఇరానీ కప్‌తో పాటు అక్టోబర్ 11 నుంచి జరిగే రంజీ ట్రోఫీ ప్రారంభ రౌండ్లకు కూడా దూరం కానున్నాడు. ముషీర్ ఖాన్ తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనే స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 51.14 సగటుతో 716 పరుగులు చేశాడు. ఎనిమిది వికెట్లు కూడా పడగొట్టాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ తరఫున 181 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
అంతేగాక రంజీ ట్రోఫీలో ముంబై విజేతగా నిలవడంలో ముషీర్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో సత్తాచాటాడు. బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అజేయంగా 203 పరుగులు సాధించాడు. విదర్భతో జరిగిన ఫైనల్‌లోనూ సెంచరీ (136)తో చెలరేగాడు. టీమిండియాలోకి అతి త్వరలోనే ఎంట్రీ ఇచ్చేలా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇండియా-ఏ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ముషీర్ ఖాన్ ఎంపిక దాదాపు ఖరారు కూడా అయ్యింది.
కాగా, ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదం గురించి ముంబై క్రికెట్ అసోషియేషన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ముషీర్ ముంబై జట్టుతో కాకుండా విడిగా లక్నోకు బయలుదేరినట్లు జాతీయ మీడియా పేర్కొంటుంది. ''ఇరానీ కప్ కోసం ముంబై జట్టులో ముషీర్ లక్నోకు బయలుదేరలేదు. అజామ్‌ఘర్ నుంచి తన తండ్రితో కలిసి లక్నోకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది'' అని ఓ సోర్స్ తెలిపిందని రాసుకొచ్చింది.