
మెల్‌బోర్న్: ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదా వేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సమ్మతించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 16 జట్లను సమన్వయం చేయడం తమ వల్ల కాదని క్రికెట్ ఆస్ట్రేలియా గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ పలుమార్లు సమావేశమైనా దానిపై నిర్ణయం తీసుకోవడానికి తొలుత సందేహించింది.
శశాంక్ మనోహర్ కొద్ది రోజుల క్రితం ఐసీసీ ఛైర్మన్‌గా తప్పుకోవడంతో.. తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్థిస్తున్న ఇమ్రాన్ ఖాజా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వర్చువల్ సమావేశంలో టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లే మీడియాతో మాట్లాడుతూ ఐసీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇకపై క్రికెట్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్‌పై దృష్టిసారిస్తుందని వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ అయి ఉన్న విషయం తెలిసిందే.
'ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అన్ని క్రీడా రంగాలపై ప్రభావం చూపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు 16 జట్లను రప్పించి సమన్వయం చేయడం ఎంతో రిస్క్‌తో కూడుకున్న పని. అది ఎంతో ప్రమాదకరం కూడా. ఒక్క ఆటగాడికి వైరస్ సోకినా మొత్తం టోర్నీపైనే ప్రభావం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్‌లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేయడం మంచిదని భావిస్తున్నాం. అందరి క్షేమం కోసమే ఆ నిర్ణయం తీసుకుంది. ఆ మెగా ఈవెంట్‌ను తిరిగి రీషెడ్యూల్ చేసినప్పుడు పూర్తిస్థాయిలో నిర్వహిస్తాం' అని హాక్లే స్పష్టం చేశారు.
టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేయడంతో ఈ ఏడాది ఐపీఎల్-13వ సీజన్‌కు మార్గం సుగమమైంది. ప్రపంచకప్ వాయిదా పడుతుందని ముందుగానే అంచనా వేసిన బీసీసీఐ.. ఐపీఎల్ తేదీలు, వేదికను ఖరారు చేసింది. వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన ఈ ఏడాది సీజన్‌ను సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏ క్షణమైనా ఐపీఎల్ తేదీలు, వేదికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించొచ్చని సమాచారం. అయితే ఆటగాళ్ల వీసాలు, ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది.