

హైదరాబాద్: చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మంచి ప్రతిభ ఆధారంగానే ఈస్థాయికి చేరుకున్నాడని మరో స్పిన్నర్ పియూష్ చావ్లా అన్నాడు. ఐపీఎల్‌లో వీరిద్దరూ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుల్దీప్‌తో కలిసి ఆడిన అనుభవాలను పియూష్ చావ్లా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
చావ్లా మాట్లాడుతూ "కుల్దీప్ ఎప్పుడూ అనుమానాస్పద బౌలర్‌గా ముద్ర వేసుకోలేదు. అదొక అపోహ మాత్రమే. కుల్దీప్‌లో మంచి నైపుణ్యం దాగుందని, మరింత మెరుగ్గా రాణించేందుకు కష్టపడుతున్నాడు" అని అన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ మంచి ప్రదర్శన చేస్తారని చెప్పాడు.
ఇటీవలి కాలంలో కుల్దీప్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని, వరల్డ్ కప్‌లో కుల్దీప్‌కు మంచి బ్యాట్స్‌మెన్ ఎదురైతే అది సవాల్‌గా మారుతుందని చావ్లా చెప్పుకొచ్చాడు. మరోవైపు వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ఐపీఎల్‌లో ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌తో పాటు పని భారాన్ని సమీక్షించుకోవాలన్న కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యలపై కూడా చావ్లా స్పందించాడు.
"మేమంతా ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఆడుతున్నాం. పనిభారం కారణంగా శరీరం ఎలా మార్పు చెందుతుందో మాకు తెలుసు. కాబట్టి ఎంత శారీరక శ్రమ తీసుకోగలమో, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో మాకు తెలుసు" అని చావ్లా పేర్కొన్నాడు. ఇక, ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ మంచి ప్రదర్శన చేస్తుందని చావ్లా అన్నాడు.
ఎలాంటి పిచ్‌మీదనైనా గెలిచే సత్తా తమకుందని చావ్లా చెప్పాడు. ఈడెన్ గార్డెన్స్‌లో ఆడటం తనకు చాలా ఇష్టమని, ఇక్కడ తమ జట్టుకు మంచి మద్దతు లభిస్తుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్‌లో ఇప్పటివరకూ వెయ్యి డాట్ బాల్స్ వేసిన ఆటగాడిగా చావ్లా అరుదైన ఘనత సాధించాడు.