ఐదో టీ20 మ్యాచ్ లోనూ ఇంగ్లాండ్ టీమ్ ఓటమిని మూటగట్టుకుంది. భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు.. భారత బౌలర్ల దెబ్బకు కుదేలైంది. వరుస ఓవర్లలో వికెట్లను కోల్పోయింది. 10.3 ఓవర్లలోనే 97 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో టీమిండియా 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 4-1 తేడాతో విజయవంతంగా ముగించింది.
ఇంగ్లాండ్ జట్టులో దూకుడుగా ఆడిన ఫిల్ సాల్ట్ 55(23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 55 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడు 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ అతడి దూకుడికి శివమ్ దూబె అడ్డుకట్ట వేశాడు. అతడు.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత జాకబ్ బెతల్ 10(7 బంతుల్లో 1 సిక్స్ సాయంతో 10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైపోయారు. హ్యారీ బ్రూక్ 2(4), లివింగ్‌స్టన్ 9(5), బ్రైడన్ కార్స్ 3(4), ఓవర్టన్ 1(3) నామమాత్రపు స్కోర్లు చేశారు.
ఇక రీఎంట్రీ ఇచ్చాక తనకు వచ్చిన రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు మహ్మద్ షమీ. అతడు మూడు వికెట్లతో చెలరేగాడు. బ్యాటింగ్ లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ.. బౌలింగ్ లోనూ రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, శివమ్ దుబే కూడా తలో రెండు వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియాలో అభిషేక్ శర్మ సెంచరీతో మెరిశాడు. 37 బంతుల్లోనే 270.3 స్ట్రైక్ రేట్ తో మెరుపు సెంచరీ చేసిన అతడు.. మొత్తంగా 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. తిలక్ (24), శి వమ్ దూబె (30) తప్ప ఇతర బ్యాటర్లు అంతగా రాణించలేదు. సంజూ శాంసన్ (16), హార్దిక్ పాండ్య (9), రింకూ సింగ్ (9), సూర్య కుమార్ యాదవ్ (2), అందరూ విఫలమయ్యారు. చివర్లో అక్షర్ (15) కూడా నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ 3 వికెట్లు పడగొట్టగా, మార్క్ వుడ్ 2, ఆర్చర్, రషీద్, ఒవర్టన్ తలో వికెట్ దక్కించుకున్నారు.