టీమిండియా యువ సెన్సేషన్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ అరాచకంతో ఎంత పాపులర్ అయ్యారో.. పర్సనల్ లైఫ్ విషయంలో కూడా అంతే చర్చల్లో నిలుస్తున్నారు. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అభిషేక్ శర్మ, లైలా ఫైసల్ అనే అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 14, 2026న (వాలెంటైన్స్ డే) వీరి వివాహం జరగనుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో అభిషేక్ కానీ, ఆయన కుటుంబం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అసలు ఈ పెళ్లి వార్తలు ఎక్కడ మొదలయ్యాయి?
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'రెడిట్' (Reddit)లో ఓ యూజర్ వీరిద్దరి ఫోటోలను షేర్ చేస్తూ.. వీరు డేటింగ్‌లో ఉన్నారని, ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నారని పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా ఈ వార్త వైరల్ అయ్యింది. అయితే ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అంతకుముందు రోజు పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని.. ఇది కేవలం పుకారు మాత్రమేనని క్రీడా విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.

లైలా ఫైసల్ నేపథ్యం ఏమిటి?
ఈ క్రమంలో లైలా ఫైసల్ గురించి ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. లైలా ఫైసల్ 2000వ సంవత్సరంలో ఢిల్లీలో జన్మించారు. వారి కుటుంబం కశ్మీర్‌కు చెందినది. ఆమె లండన్‌లోని కింగ్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్యాషన్ రంగంపై ఉన్న మక్కువతో లండన్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు. ప్రస్తుతం ఆమె ఒక విజయవంతమైన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్. తన తల్లి రూహీ ఫైసల్‌తో కలిసి 'LRF డిజైన్స్' అనే లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌ను నడుపుతున్నారు. అలాగే తన తండ్రి ప్రారంభించిన 'సౌండ్ ఆఫ్ మ్యూజిక్' అనే హోమ్ థియేటర్ కంపెనీకి ఆమె COOగా వ్యవహరిస్తున్నారు. లైలా ఫైసల్ నికర ఆస్తి విలువ సుమారు 4 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
అభిషేక్ - లైలా మధ్య సంబంధం ఎలా మొదలైంది?
2025 ప్రారంభం నుంచి వీరిద్దరి పేర్లు కలిసి వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025, టీమిండియా మ్యాచ్‌ల్లో అభిషేక్‌ను ఉత్సాహపరచడానికి లైలా స్టేడియానికి వచ్చే వారు. ఇంగ్లాండ్‌పై అభిషేక్ సెంచరీ చేసినప్పుడు లైలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ప్రౌడ్' అని పోస్ట్ చేయడం చర్చకు దారితీసింది. అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ వివాహ వేడుకల్లో కూడా లైలా సందడి చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు బలపడ్డాయి.
సోషల్ మీడియా క్రేజ్
లైలా ఫైసల్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమెకు దాదాపు 79,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె తరచుగా షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ దృష్టి అంతా ఫిబ్రవరి 7 నుండి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌పైనే ఉంది. పెళ్లి వార్తలు పుకార్లే అయినప్పటికీ, లైలా - అభిషేక్ జోడీ మాత్రం సోషల్ మీడియాలో 'హాట్ కపుల్'గా మారిపోయింది.