దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన సూపర్-8 పోరులో టీమిండియా ఘోర పరాజయం కేవలం జట్టు పరువునే కాకుండా కొందరు యువ ఆటగాళ్ల భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంలో నెట్టేసింది. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ ప్రపంచ కప్‌లో వరుసగా డకౌట్లతో విఫలమైన అభిషేక్.. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం 15 పరుగులు (12 బంతుల్లో) చేసి పెవిలియన్ చేరడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
అమీర్ అన్నట్టు 'స్లాగర్' మాత్రమేనా?
పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ గతంలో అభిషేక్ శర్మను ఉద్దేశించి చేసిన కామెంట్లను ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. "అభిషేక్ శర్మ కేవలం ఒక స్లాగర్ (గుడ్డిగా బ్యాట్ ఊపేవాడు) మాత్రమే.. అతడు క్లాస్ ప్లేయర్ కాదు" అని అమీర్ గతంలో విమర్శించాడు. తాజాగా అభిషేక్ ఆడిన తీరు చూస్తుంటే అమీర్ చెప్పిందే నిజమనిపిస్తోందని నెటిజన్లు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఫ్లాట్ పిచ్‌లపై, ద్వైపాక్షిక సిరీస్‌లలో చెలరేగిపోయే అభిషేక్.. వరల్డ్ కప్ వంటి ఒత్తిడితో కూడిన టోర్నీలలో పూర్తిగా ఎక్స్‌పోజ్ అయ్యాడని మండిపడుతున్నారు.

ఫ్యాన్స్ ఆగ్రహం.. మీమ్స్ వెల్లువ
సోషల్ మీడియాలో అభిషేక్ శర్మపై మీమ్స్ వర్షం కురుస్తోంది. ఒక అభిమాని స్పందిస్తూ, "భారత క్రికెట్‌కు దొరికిన అతిపెద్ద మోసం (Fraud) అభిషేక్ శర్మ. అతడు భవిష్యత్తులో సెంచరీ చేసినా నా దృష్టిలో ఫ్రాడే" అని ఘాటుగా రాసుకొచ్చాడు. మరికొందరు అతడిని పాకిస్థాన్ మాజీ ప్లేయర్ అవైస్ జియాతో పోలుస్తూ.. బంతిని చూడకుండా బ్యాట్ ఊపుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.
సంజూ శాంసన్‌ను తీసుకురండి!
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న అభిషేక్ శర్మ, తిలక్ వర్మలను తప్పించి అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. "రోహిత్ శర్మను తిరిగి తీసుకురండి, లేదా సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వండి.. ఈ ఐపీఎల్ స్టార్లతో వరల్డ్ కప్ గెలవడం అసాధ్యం" అంటూ మేనేజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ ప్రదర్శనలపై కూడా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గందరగోళంలో గంభీర్ వ్యూహాలు
కోచ్ గౌతమ్ గంభీర్ అభిషేక్ శర్మకు వ్యక్తిగతంగా క్లాసులు తీసుకున్నప్పటికీ.. మైదానంలో ఫలితం మాత్రం సున్నాగా ఉంది. 188 పరుగుల లక్ష్య ఛేదనలో 15 ఓవర్లకే భారత్ 88/8తో కుప్పకూలిపోవడం, చివరికి 111 పరుగులకే ఆలౌట్ కావడం టీమిండియా బ్యాటింగ్ లోతును బయటపెట్టింది. కేశవ్ మహారాజ్ ఒకే ఓవర్లో హార్దిక్, రింకూ, అర్ష్‌దీప్‌లను ఔట్ చేయడంతో భారత్ కోలుకోలేకపోయింది. శివమ్ దూబే (42) ఒక్కడే పోరాడటం మినహా, మిగిలిన వారంతా విఫలమయ్యారు. భారత్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తదుపరి మ్యాచ్‌ల్లో భారీ మార్పులు అనివార్యమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు