తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా సిక్సర్ల కింగ్ అభిషేక్ శర్మ దూసుకెళ్లాడు. ఇంగ్లాండ్ పై ఐదో టీ20 లో రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ బాదిన అతడు.. 829 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఏకంగా 38 స్థానాలు ఎగబాకి ఈ రెండో ర్యాంకును అందుకున్నాడు. సన్‌రైజర్స్ పార్టనర్, ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. అతడి కన్నా కేవలం 26 పాయింట్లు వెనుకంజలో మాత్రమే ఉన్నాడు అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ కేవలం బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మాత్రమే కాదు.. ఆల్ రౌండర్ విభాగంలోనూ 31 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరుకున్నాడు.
బ్యాటింగ్ విభాగంలో టాప్ -5లో అభిషేక్ శర్మతో పాటు మరో ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ కూడా చోటు సంపాదించుకున్నారు. తిలక్ వర్మ (803 పాయింట్లు) మూడో స్థానాన్ని దక్కించుకోగా.. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో నిలిచాడు. హార్దిక్ పాండ్య ఐదు స్థానాలు ఎగబాకి 51వ ర్యాంకుకు చేరుకోగా, శివమ్ దూబె ఏకంగా 38 స్థానాలను దాటుకుని వెళ్లి 58వ స్థానంలో నిలిచాడు.

మూడో స్థానంలోకి వరుణ్
బౌలింగ్ విభాగంలో.. ఇంగ్లాండ్ పై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుసేన్ (707 పాయింట్లతో) టాప్ ప్లేస్ లో నిలిచాడు. అదిల్ రషీద్, వరుణ్ చక్రవర్తి చెరో 705 పాయింట్లతో రెండు, మూడు స్థానాలను సంపాదించుకున్నారు. రవి బిష్ణోయ్ (671 పాయింట్లు) నాలుగు స్థానాలు ముందుకు జరిగి ఆరో ర్యాంకులో నిలిచాడు.
అగ్రస్థానంలో బుమ్రా..
టెస్టుల్లో.. బ్యాటింగ్ విషయానికొస్తే ఇంగ్లాండ్ జో రూట్ (895) అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్ -10లో కేవలం ఇద్దరు భారత బ్యాటర్లు మాత్రమే ఉండగా.. వారిలో నాలుగో స్థానంలో యశస్వి జైస్వాల్ (847), 9వ స్థానంలో రిషభ్ పంత్ (739) నిలిచారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా (908) టాప్ పొజిషన్ లో నిలిచాడు. జడేజా (745) తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నాడు.