టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఫిబ్రవరి 12 (గురువారం) నమీబియాతో జరగనున్న కీలక పోరుకు ముందు భారత జట్టులో ఆందోళన నెలకొంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకా అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకోలేదు. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అభిషేక్ శర్మ పాల్గొనకపోవడంతో నమీబియా మ్యాచ్‌లో ఆయన ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రాక్టీస్ సెషన్లో కనిపించని అభిషేక్
మంగళవారం సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగిన శిక్షణా శిబిరానికి జట్టు సభ్యులంతా హాజరైనప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం కనిపించలేదు. ఆయన ఇంకా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని కోచింగ్ స్టాఫ్ ధ్రువీకరించారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా అభిషేక్ అనారోగ్యంతో బరిలోకి దిగాడు. కానీ పరిస్థితి విషమించడంతో ఫీల్డింగ్‌కు రాలేకపోయారు.

రేసులో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్
అభిషేక్ శర్మ అందుబాటులో లేని పక్షంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్స్‌లో సంజూ శాంసన్ సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అయితే ఇటీవలి న్యూజిలాండ్ సిరీస్‌లో సంజూ ఫామ్ అంత ఆశాజనకంగా లేదు. ఇషాన్ కిషన్ నెట్స్‌లో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. శివమ్ దూబే, హార్దిక్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
మేనేజ్మెంట్ ఆలోచన ఏంటి?
బ్యాటింగ్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ మాట్లాడుతూ.. "అభిషేక్ ఇంకా కోలుకుంటున్నాడు. టోర్నీ సుదీర్ఘమైనది కాబట్టి, ఆయన విషయంలో మేము తొందరపడదలచుకోలేదు" అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్ నాటికి అభిషేక్‌ను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంచడమే టీమ్ మేనేజ్మెంట్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇటీవల జట్టులో చేరిన వాషింగ్టన్ సుందర్ కూడా ప్రాక్టీస్ సెషన్‌లో చురుగ్గా పాల్గొన్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా నెట్స్‌లో అదనపు సమయం ప్రాక్టీస్ చేశారు.సోమవారం రాత్రి టీమిండియా ఆటగాళ్లంతా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నివాసంలో జరిగిన డిన్నర్ పార్టీలో పాల్గొన్నారు.