ఐపీఎల్‌లో అభిషేక్ విధ్వంసం.. కారణం ఆ ఇద్దరే!
సన్‌రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారిస్తున్నాడు. క్రీజులోకి వస్తే చాలు బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ యువ సంచలనం.. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనే 380 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ఇందులో ఓ మెరుపు సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. అయితే తన ఈ అద్భుతమైన ఫామ్ వెనుక ఉన్న అసలు కారణాలను, తన కెరీర్‌ను మలుపు తిప్పిన వ్యక్తుల గురించి అభిషేక్ తాజాగా మనసు విప్పాడు.
యువరాజ్ శిక్షణలో రాటుదేలిన అభిషేక్ శర్మ
తన ఆట తీరును, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చడంలో టీమిండియా మాజీ దిగ్గజం, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించారని అభిషేక్ శర్మ కృతజ్ఞత తెలిపాడు. లాక్‌డౌన్ సమయంలో యువీ వద్ద పొందిన శిక్షణ తన కెరీర్‌లోనే అతిపెద్ద మలుపు అని అభిషేక్ శర్మ పేర్కొన్నాడు. "యువీ పాజీ నన్ను కేవలం ఐపీఎల్ లేదా డొమెస్టిక్ క్రికెట్ కోసం సిద్ధం చేయలేదు. టీమిండియా తరపున ఆడేటప్పుడు.. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన పెద్ద మ్యాచ్‌లను ఒంటిచేత్తో ఎలా గెలిపించాలి అనే దానిపై నాకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు. ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడటం ద్వారా జట్టును విజయం వైపు ఎలా నడిపించాలో ఆయన దగ్గర నేర్చుకున్నాను" అని అభిషేక్ శర్మ వివరించాడు.

అభిషేక్ తన క్రికెట్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ.. తన తండ్రి రాజ్‌కుమార్ శర్మ (పంజాబ్ రంజీ ప్లేయర్, కోచ్) నుంచి తనకు క్రికెట్ వారసత్వంగా వచ్చిందని చెప్పాడు. ఇంట్లో చిన్నప్పటి నుంచే క్రికెట్ వాతావరణం ఉండటం, టీవీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు చూస్తూ పెరగడం వల్ల తనలో తెలియని పట్టుదల పెరిగిందని తెలిపాడు. ముఖ్యంగా అండర్-12 టోర్నమెంట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించడం తనపై తనకు నమ్మకాన్ని కలిగించిందని, అప్పుడే క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు.
ట్రావిస్ హెడ్ ఇచ్చిన కిర్రాక్ సలహా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తన సహచర ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రభావం కూడా తన బ్యాటింగ్‌పై చాలా ఉందని అభిషేక్ శర్మ వెల్లడించాడు. మైదానంలో ట్రావిస్ హెడ్ అనుసరించే దూకుడు తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పాడు. "హెడ్ తన బ్యాటింగ్‌తో బౌలర్లను ఆరంభం నుంచే ఎలా ఆధిపత్యం చేస్తాడో అడిగి తెలుసుకున్నాను. బంతిని జాగ్రత్తగా గమనించి, అది నీ జోన్‌లోకి వస్తే తొలి బంతి నుంచే బాదడానికి వెనుకాడకు అని హెడ్ ఇచ్చిన సలహా నా ఆటను మరింత మెరుగుపరిచింది" అని అభిషేక్ శర్మ అన్నాడు. యువరాజ్ శిక్షణ, హెడ్ మెంటార్‌షిప్‌తో అభిషేక్ శర్మ భారత క్రికెట్ భవిష్యత్తు సూపర్ స్టార్‌గా ఎదుగుతున్నాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications