హైదరాబాద్: ఐదున్నరేళ్ల తర్వాత టీమిండియా టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ బెంగుళూరులో టెస్టులో నిరాశపరిచాడు. ఆస్ట్రేలియాతో బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్న అభినవ్ ముకుంద్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
2011లో జూలైలో ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హమ్‌లో జరిగిన టెస్టులో అభినవ్ చివరిసారిగా భారత జట్టు తరుపున ఆడాడు. ఇన్నాళ్లకు మళ్లీ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న అతని ఆట తీరులో మాత్రం మారలేదు. ఈ మధ్య కాలంలో టీమిండియా ఆడిన 56 టెస్టు మ్యాచ్‌లను అభినవ్ మిస్సయ్యాడు.
ఇంగ్లాండ్‌తో చివరిసారిగా ఆడిన మ్యాచ్‌లో డకౌట్ అయిన అభినవ్ తాజాగా ఫిబ్రవరి 4 (శనివారం) నుంచి బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో ప్రారంభమైన రెండో టెస్టులో కూడా డకౌట్ గానే వెనుదిరిగాడు. ఈ టెస్టులో 8 బంతులను ఎదుర్కొన్న అభినవ్ మూడో ఓవర్‌లో స్టార్క్ వేసిన యార్కర్ లెంగ్త్ బంతిని అంచనా వేయలేక ఎల్బీగా వెనుదిరిగాడు.

ఇంగ్లాండ్‌తో ఆడిన టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో కూడా అభినవ్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. దాంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగ పరచుకోలేక పోయాడు. బెంగుళూరు టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో కూడా అభినవ్ రాణించకపోతే ఇక భారత జట్టులో అతడి చోటు కలగానే మిగులుతుందేమో!
బెంగుళూరు టెస్టులో టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ఓపెనర్ మురళీ విజయ్ గాయపడటంతో అతని స్థానంలో అభినవ్ ముకుంద్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు జయంత్ యాదవ్‌ను తప్పించి అతడి స్ధానంలో కరుణ్ నాయర్‌ను తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు.