
మానసికంగా దెబ్బతీసేందుకు:
అక్టోబర్ 24న జరిగే మ్యాచ్‌తో భారత్, పాకిస్తాన్ జట్లు టీ20 ప్రపంచకప్ 2021లో తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి. అందుకే విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఐసీసీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే దాయాది జట్ల మధ్య జరిగే పోరుకోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే పాక్ మాజీ ప్లేయర్స్ అప్పుడే మాటల యుద్ధానికి తెరలేపారు. తాజాగా పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ టీమిండియాను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. పాక్ టీమ్‌లో ఉన్న టాలెంట్‌ను చూస్తే.. భారత జట్టు కనీస పోటీ కూడా ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడేంత బలంగా లేదన్నాడు.

పాకిస్థాన్‌లో ఉన్న టాలెంట్ భిన్నమైనది:
పాకిస్తాన్ న్యూస్ ఛానల్ ఏఆర్‌వైతో తాజాగా అబ్దుల్ రజాక్ మాట్లాడాడు. భారతదేశంలో పాకిస్తాన్ వంటి ఫాస్ట్ బౌలర్లు, ఆల్ రౌండర్లు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అని ఆ ఛానెల్ యాంకర్ అడగ్గా... 'పాకిస్థాన్‌తో భారత్ పోటీపడుతుందని అనుకోవడం లేదు. పాకిస్థాన్‌లో ఉన్న టాలెంట్ చాలా భిన్నమైనది. ఇలాంటి సమయంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు లేకపోవడం క్రికెట్‌కు మంచిది కాదు. దాయాదుల మ్యాచ్ ఎంతో ఆసక్తిగా ఉండేది. ఆటగాళ్లు ఎంత ఒత్తిడి తట్టుకునే వాళ్లో తేలిపోయేది. అది ఇప్పుడు మిస్ అవుతున్నాం. రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగి ఉంటే.. పాకిస్థాన్‌లో ఎంత టాలెంట్ ఉందో, అది టీమిండియాలో ఎందుకు లేదో స్పష్టంగా తెలిసేది' అని సమాధానం ఇచ్చాడు.

భారత్ పోటీపడలేదు:
'పాకిస్థాన్ జట్టులో ఉన్నట్లు భారత జట్టులో ఆల్‌రౌండర్లు, పేసర్లు ఉన్నారా?. ఈ విషయంలో రెండు జట్ల మధ్య అసలు పోలికే లేదు. పాక్‌తో భారత్ పోటీపడలేదని నా అభిప్రాయం. పాక్ ఆటగాళ్ల సామర్థ్యం భారత్‌తో పోలిస్తే భిన్నమైంది. అందుకే వారు పాక్‌తో సిరీస్‌లో పోటీపడరు. పాక్‌లాంటి జట్టును తయారు చేయడం కోసం భారత్ ప్రయత్నిస్తోంది. భారత్ కూడా గొప్ప జట్టే. భారత జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కానీ శక్తి సామర్థ్యాల ప్రకారం చూస్తే.. పాక్‌కు ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు. అదే సమయంలో భారత్‌కు కపిల్ దేవ్ ఉన్నాడు. వీరిద్దరిలో ఇమ్రాన్ ఉత్తమం. మాకు వసీమ్ అక్రమ్ కూడా ఉన్నాడు. కానీ అతడి సత్తాతో పోల్చదగిన బౌలర్ భారత్‌లో లేడు. మాకు మియాందాద్ ఉంటే వారికి గావస్కర్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య అసలు పోలికే లేదు. మాకు ఇంజమామ్, యూసఫ్, యూనిస్ ఉంటే వారికి ద్రవిడ్, సెహ్వాగ్ ఉన్నారు. మొత్తంగా పాక్ అత్యుత్తమ క్రికెటర్లను అందించింది. అందుకే పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ ఇష్టపడదు' అని అబ్దుల్ రజాక్ అన్నాడు.

టీమిండియాదే పైచేయి:
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాది జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్‌లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం టీమిండియా.. పాక్‌కు వెళ్లింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. 2018 ఆసియా కప్, 2019 వన్డే ప్రపంచకప్ పోరులో పాక్ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్ నాలుగు గెలవగా.. ఓ మ్యాచ్ టైగా బౌల్ అవుట్‌లో టీమిండియానే గెలుపొందింది.


Click it and Unblock the Notifications












