పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తరచుగా తన వివాదాస్పద, వింత కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఓ పాపులర్ టాక్ షోలో తన భార్య ఆయిషా రజాక్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. తన వైవాహిక జీవితం, ఇంటి బాధ్యతలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ తన భార్య ఎదుటే చేసిన ఒక వింత వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరదాగా సాగిన ఒక టీవీ షోలో ఆయన తన రెండో పెళ్లి గురించి చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.
నీ భారం తగ్గిస్తా.. ఇంకో పెళ్లి చేసుకుంటా!
షోలో భాగంగా ఆయిషా మాట్లాడుతూ.. రజాక్ క్రికెట్‌లో బిజీగా ఉండటం వల్ల ఇంటి బాధ్యతలన్నీ తానే చూసుకుంటానని చెప్పారు. పిల్లల స్కూల్, పేరెంట్స్ మీటింగ్స్, ఇంటికి అవసరమైన సరుకులు తేవడం వంటి పనులన్నీ తానొక్కత్తే చక్కబెడతానని వివరించారు. భార్య పడుతున్న ఈ కష్టాన్ని ఉద్దేశించి రజాక్ చమత్కరిస్తూ.. "నువ్వు ఒక్కదానివే ఇన్ని పనులు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నావు, నీ భారం తగ్గించడానికి నేను రెండో పెళ్లి చేసుకుంటానని ఆమెతో చాలాసార్లు చెప్పాను" అని నవ్వుతూ అన్నారు.

రెండో భార్య వస్తే పని పంచుకోవచ్చు!
రజాక్ ఈ మాట అనగానే హోస్ట్, అక్కడున్న వారంతా నవ్వారు. భార్య ఆయిషా కూడా ఆయన జోక్‌ను సరదాగా తీసుకుని నవ్వేసింది. హోస్ట్ నిదా యాసిర్ స్పందిస్తూ.. "రజాక్ మీకు ఎప్పుడైనా సర్ప్రైజ్‌లు ఇస్తారా?" అని ఆయిషాను అడగ్గా.. రజాక్ వెంటనే అందుకొని.. "నిదా అడుగుతోంది నేను రెండో పెళ్లి చేసుకుని ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చానా అని" అంటూ తన కామెడీని కొనసాగించారు.
కజిన్‌తోనే వివాహం.. 10 ఏళ్ల ఏజ్ గ్యాప్
అబ్దుల్ రజాక్, ఆయిషా వివాహం వెనుక ఒక విశేషం ఉంది. ఆయిషా రజాక్ స్వయానా ఆయన మేనమామ కూతురు. వీరిద్దరి మధ్య దాదాపు 10 ఏళ్ల వయసు తేడా ఉంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. షో అంతా రజాక్ తన రెండో పెళ్లి గురించి జోకులు వేస్తున్నా.. ఆయిషా మాత్రం చాలా హుందాగా నవ్వుతూ స్పందించడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది కేవలం సరదా కోసం అన్న మాటలే అని కొట్టిపారేయగా.. మరికొందరు భార్య కష్టాన్ని ప్రశంసించాల్సింది పోయి ఇలాంటి జోకులు వేయడం ఏంటని విమర్శిస్తున్నారు.