
ఎంతమాత్రం ప్లాన్స్ లేవు
ఏబీ డివిలియర్స్ 2018 మేలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా పలు టీ20 లీగ్‌లలో అతను ఆడాడు. కానీ 2021 నవంబర్‌లో అన్ని రకాల క్రికెట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. అతను ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడలేదు. అభిమానులు మాత్రం ఏబీ డివిలియర్స్ తన రిటైర్మెంట్ విషయమై మరోసారి పునరాలోచించి.. మళ్లీ క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్లోకి అడుగుపెట్టాలని కోరుకున్నారు. కానీ తాను ఇక ఎంతమాత్రం
మళ్లీ క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్లోకి అడుగుపెట్టే ప్లాన్స్ లేవని డివిలియర్స్ సోమవారం స్పష్టం చేశాడు.

అందుకే క్రికెట్ ఆడలేను
అయితే ఐపీఎల్ 2023 సందర్భంగా తాను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి వెళ్లాలనుకుంటున్నానని, ఐపీఎల్‌లో ఆడుతున్న టైంలో తనకు లభించిన మద్దతుకు బెంగళూరు అభిమానులందరికీ ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నానని డివిలియర్స్ చెప్పాడు. డివిలియర్స్ ఆర్సీబీ తరఫున 157మ్యాచ్‌లు ఆడి 4522పరుగులు చేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ మధ్య అపురూపమైన స్నేహం నెలకొన్న సంగతి తెలిసిందే. 'నేను వచ్చే ఏడాది చిన్నస్వామి స్టేడియానికి వెళ్తాను. కానీ క్రికెట్ ఆడ్డానికి కాదు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఆర్సీబీకి టైటిల్ అందించలేకపోయినందుకు ఆర్సీబీ అభిమానులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. గత దశాబ్ద కాలంగా వారు అందించిన మద్దతుకు నేను వారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇకపై నేను క్రికెట్ ఆడను. ఎందుకంటే నా కుడి కంటికి శస్త్రచికిత్స జరిగింది. ఒంటి కన్నుతో ఆడడం చాలా కష్టమే' అని డివిలియర్స్ చెప్పాడు

ప్రత్యేక ప్రాజెక్ట్ కోసం ఇండియాకు త్వరలో
ఇకపోతే డివిలియర్స్ ఒక యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలిపాడు. విరాట్ కోహ్లీ తన షోకి తొలి గెస్ట్ అని చెప్పాడు. లెజెండ్స్ లీగ్‌లో ఆడేందుకు తనకు ఆఫర్ వచ్చిందని.. అయితే దాన్ని తిరస్కరించానని డివిలియర్స్ వెల్లడించాడు. తన క్రికెట్ పరిజ్ఞానాన్ని తర్వాతి తరం క్రికెటర్లతో పంచుకోవాలనుకుంటున్నానని, కోచింగ్ సైడ్ కూడా వెళ్లబోనని, ఇప్పటికే ఏళ్లుగా క్రికెట్‌తో మమేకమై ఉన్నానని, అందువల్ల తన కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నానని చెప్పాడు. 'నేను ఇప్పుడు కాస్త ఏజుడ్ పర్సన్నే. లెజెండ్స్ లీగ్ నుంచి ఆఫర్ వచ్చింది. కానీ నాకు కంటి ఆపరేషన్ జరిగింది. నేను ఒక కన్నుతో ఆడగలనా చెప్పండి. ఇక ఏ జట్టుకు కోచ్‌గా పనిచేయాలని ప్లాన్ చేయడం లేదు. నేను నేర్చుకున్న ప్రతిదాన్ని అందరికీ పంచాలనుకుంటున్నా. అందువల్ల ప్రస్తుతం క్రికెట్ పనుల మీద ప్రపంచం చుట్టు తిరగాలనుకోవట్లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. 18ఏళ్ల పాటు క్రికెట్ ప్రయాణం చేసిన తర్వాత ఇంట్లో కొంత సమయం గడపాలనుకుంటున్నా. అయితే ఒక 'ప్రత్యేక' ప్రాజెక్ట్ కోసం నవంబర్‌లో ఇండియాకు రావాలనుకుంటున్నా. ఒకట్రెండు వారాల్లో దీని గురించి మరింత సమాచారం వెల్లడిస్తా' అని డివిలియర్స్ చెప్పాడు.


Click it and Unblock the Notifications












